Begin typing your search above and press return to search.

తాగుబోతుల‌ను ఏమీ అనొద్దు!

By:  Tupaki Desk   |   17 Feb 2018 9:57 AM GMT
తాగుబోతుల‌ను ఏమీ అనొద్దు!
X
మ‌ద్యం తాడి వాహ‌నం న‌డ‌ప‌డం... చాలా ప్ర‌మాద‌క‌మైన విష‌య‌మే. ఎందుకంటే... డ్రంక‌న్ డ్రైవ్ వ‌ల్ల స‌ద‌రు మందు బాబుతో పాటుగా రోడ్డుపై ఏ పాపం ఎరుగ‌ని వారికి కూడా ప్ర‌మాదాలు జ‌రిగే అవకాశాలు ఎక్కువేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. హెల్మెట్ పెట్టుకోవాల‌ని చెప్ప‌డం అంటే... త‌న‌ను తాను ర‌క్షించుకోమ‌ని చెప్ప‌డమే. అదే డ్రంక‌న్ డ్రైవ్ వ‌ద్ద‌ని చెప్ప‌డ‌మంటే... త‌మ‌తో పాటు ఎదుటి వారి భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్న స‌ల‌హాగానే చెప్పుకోవాలి. ఈ లెక్క‌న హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కంటే డ్రంక‌న్ డ్రైవింగ్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్పుదు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదుతో పాటుగా ఎక్క‌డ చూసినా డ్రంక‌న్ డ్రైవ్‌ ల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపార‌నే చెప్పాలి. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు... హైద‌రాబాదులోని జూబ్లీహిల్స్‌ - బంజారాహిల్స్ ప్రాంతాల‌కు గేట్ వేగా ఉన్న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద లెక్క‌లేనంత మంది మందుబాబులు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. వీరిలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు - స‌మాజంలో పేరు ప్రఖ్యాతులున్న సినీ సార్లు - పొలిటీషియ‌న్ల పిల్ల‌లు కూడా ఉంటున్నారు. ఈ త‌ర‌హా వ్య‌క్తులు... డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీల్లో పాలుపంచుకుంటున్న పోలీసుల‌పై త‌మ‌దైన శైలిలో దురుసుగా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ త‌ర‌హా దురుసు వ‌ర్త‌న పోలీసుల‌పైకి దాడులు జ‌రిగే దాకా కూడా వెళుతోంది. ఇలాంటి సందర్భాల్లో నిజంగానే పోలీసులకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. మొన్న ఈ త‌ర‌హాలోనే జ‌రిగిన ఓ గొడ‌వ... మొత్తం డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీల తీరునే మార్చివేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు మ‌ద్యం మ‌త్తులో ఉన్న వారు కాస్తంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటుగా త‌మ ఎదురుగా ఎవ‌రున్నార‌న్న విష‌యాన్ని కూడా అంత పెద్ద‌గా ప‌ట్టించుకోరనే చెప్పాలి. ఇక ప్ర‌ముఖుల పిల్ల‌లైతే... పోలీసుల‌పైకి దూసుకువ‌స్తున్నారు. ఈ త‌రుణంలో అస‌లు డ్రంక‌న్ డ్రైవ్‌ ల‌లో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై పోలీసుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చేందుకు హైద‌రాబాదు పోలీసు బాసులు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ మొద‌లెట్టిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. డ్రంక‌న్ డ్రైవ్‌ ల‌లో ప‌ట్టుబ‌డే వ్య‌క్తులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యంపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటుగా కాస్తంత దురుసుగా వ్య‌వ‌హ‌రించే వారిని ఎలా క‌ట్ట‌డి చేయాల‌న్న విష‌యాల‌పై ఈ శిక్ష‌ణ‌లోఖాకీల‌కు త‌ర్ఫీదు ఇస్తార‌ట‌. ఇందులో భాగంగా స‌హ‌నం అనే విష‌యాన్ని పోలీసుల్లో నూరి పోస్తున్నారు. మొత్తానికి డ్రంక‌న్ డ్రైవ్‌ ల‌లో ప‌రిస్థితులు క‌ట్టు త‌ప్ప‌కుండా ఉండేలా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అయినా డ్రంకన్ డ్రైవ్ త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డే చాలా మంది వ్య‌క్తులు పెద్ద‌గా రాద్ధాంతం చేయ‌కుండానే... ప‌ట్టుబ‌డిపోయాం క‌దరా బాబూ అంటూ సైలెంట్ గానే వెళ్లిపోతారు. అయితే ప్ర‌ముఖుల పిల్ల‌లు తార‌స‌ప‌డిన‌ప్పుడు మాత్రం ప‌రిస్థితి అప్ప‌టిక‌ప్పుడు పూర్తిగా మారిపోతోంది. ధ‌న‌బ‌లం - రాజ‌కీయ బ‌లం - సెల‌బ్రిటీల పిల్ల‌ల‌మ‌నే అహం... ప్ర‌ముఖుల పిల్ల‌ల్లో క‌నిపిస్తోంది. త‌మ‌నే ప‌ట్టుకుంటారా? అంటూ వారు నానా యాగీ చేస్తున్న వైనం కూడా మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. వీరిని ట్యాకిల్ చేయడం పోలీసుల‌కు పెద్ద సవాలే. ఎందుకంటే... అస‌లు స‌ద‌రు ప్ర‌ముఖుల పిల్ల‌లు చెబుతున్న వివ‌రాలు నిజ‌మో?, కాదో? కూడా నిర్ధారించుకోవడానికి వీలు చిక్క‌డం లేదు. ఫ‌లానా పొలిటీషియ‌న్‌ - ఫ‌లానా స్టార్ హీరో అంటే గుర్తు ప‌డ‌తాం గానీ... వారి పిల్ల‌లు బ‌య‌టి ప్రపంచానికి పెద్ద‌గా తెలియ‌దు కదా. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎవ‌రోన‌న్న అంశం ప్రతి పోలీసుకూ తెలియద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో కాస్తంత స‌హ‌నంతో మందుబాబుల‌తో వ్య‌వ‌హరిస్తే ఇబ్బంది ఉండ‌ద‌ని పోలీసు బాసులు భావిస్తున్నారు.

మ‌ద్యం మ‌త్తు త‌ల‌కెక్కిన యువ‌త చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న వాస్త‌వాన్ని గుర్తెరిగి మ‌స‌లుకోవాల‌ని - ఈ విష‌యంలో స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌డం కంటే మించిన మార్గం లేద‌ని కూడా వారు భావిస్తున్నారు. ఇదే విష‌యాన్ని డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీల్లో పాలుపంచుకునే ఖాకీల‌ను నూరి పోస్తున్నారు. అంతేకాకుండా డ్రంక‌న్ డ్రైవ్ కేసులు అధికంగా న‌మోద‌య్యే వీకెండ్‌ ల‌లో త‌ప్ప‌నిస‌రిగా ఓ ఉన్న‌త స్థాయి పోలీసు అధికారి ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. ఓ డీఎస్పీ - ఏసీపీ స్థాయి అధికారులైతే.. ప‌రిస్థితిని సాఫ్ట్‌ గా మేనేజ్ చేయొచ్చ‌న్న‌ది పోలీసు బాసుల భావ‌న‌గా తెలుస్తోంది. మొత్తానికి ఇటీవ‌ల మందు తాగి బండెక్కి... నిలువ‌రించిన పోలీసుల‌పైకే ఎదురు తిరిగిన యువ‌కుల తీరుతో మొత్తం డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీల్లో మార్చు వ‌చ్చేసింద‌న్న మాట‌. చూద్దాం.... ఈ త‌రహా త‌నిఖీలు ఏమాత్రం ఫ‌లితాలు ఇస్తుందో.