Begin typing your search above and press return to search.

డిసెంబ‌రు 31న మందుబాబుల‌కు షాక్!

By:  Tupaki Desk   |   27 Dec 2017 8:32 AM GMT
డిసెంబ‌రు 31న మందుబాబుల‌కు షాక్!
X
మ‌రో 4 రోజుల్లో 2017 సంవ‌త్స‌రానికి వీడ్కోలు ప‌ల‌క‌బోతున్నాం.....స‌రికొత్త ఆశ‌ల‌తో - వినూత్న ఆలోచ‌న‌ల‌తో నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌ల‌క‌బోతున్నాం. పాత‌....కొత్త‌...సంవ‌త్స‌రాల‌కు వార‌ధిగా నిలిచే డిసెంబ‌రు 31వ తేదీ రాత్రి `మందుబాబు`లంద‌రూ పండ‌గ చేసుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే, కొన్ని సంద‌ర్భాల్లో ఆ వేడుక‌లు కొంత‌మందికి విషాదాన్ని మిగులుస్తాయి. ఆ రోజు రాత్రి మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డిపి మందుబాబులు ప్ర‌మాదాలకు గురైన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆ రోజు రాత్రంతా డ్రంక‌న్ డ్రైవ్ చేప‌ట్టి వాహ‌నాలన్నింటినీ త‌నిఖీలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రాన్ని ప్రమాద రహితంగా ప్రారంభించాల‌ని చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

సాధార‌ణంగా వీకెండ్స్ లో రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు డ్రంక‌న్ డ్రైవ్ ను నిర్వ‌హిస్తారు. కానీ, డిసెంబర్‌ 31న (ఆదివారం) రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహిస్తామని ట్రాఫిక్‌ విభాగం డీసీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. మామూలు రోజుల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ల‌ వారీగా కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే తనిఖీలు నిర్వ‌హిస్తార‌ని - కానీ, 31న నగర వ్యాప్తంగా పెట్రోలింగ్ చేస్తూ అవసరమైన చోట తనిఖీలు చేప‌డ‌తామ‌న్నారు. అందుకోసం - మొబైల్‌ టీమ్స్‘డెకాయ్‌ టీమ్స్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజున దాదాపు 100 బృందాలు త‌నిఖీల్లో పాల్గొనేట్లుగా ప్లాన్ చేశామ‌ని డీసీపీ తెలిపారు. నగర శివార్ల నుంచి గల్లీల వ‌ర‌కూ అన్ని ప్రాంతాల‌పైనా ఫోక‌స్ చేస్తామ‌ని చెప్పారు. మద్యం తాగి వాహ‌నాలు న‌డిపిన వారిపై కేసు నమోదు చేసి - వాహనం స్వాధీనం చేసుకుంటామ‌న్నారు. సేఫ్‌ న్యూ ఇయర్‌ వేడుకలే తమ లక్ష్యమని - దానికి అవ‌స‌ర‌మైన చర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.