Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రికి కానీ ఇళ్ల‌కు చేరుకోని ఐటీ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   10 Oct 2017 8:05 AM GMT
అర్థ‌రాత్రికి కానీ ఇళ్ల‌కు చేరుకోని ఐటీ ఉద్యోగులు
X
ఐటీ ఉద్యోగులు అన్న వెంట‌నే ఐదెంక‌ల జీతం గుర్తుకు వ‌స్తుంది. వారికుండే సౌక‌ర్యాలు.. సౌల‌భ్యాల గురించి అదే ప‌నిగా మాట్లాడే వారు చాలామందే క‌నిపిస్తారు. కానీ.. వాటి వెనుక ఉండే క‌ష్టం గురించి మాట్లాడేవారు.. వారికుండే ఒత్తిడి గురించి చ‌ర్చించేవారు.. వారికి లేని ఉద్యోగ భ‌ద్ర‌త గురించి చెప్పే మీడియా కానీ క‌నిపించ‌దు. కాలేజీ చ‌దువు అయిపోయిందో లేదో.. కెరీర్‌.. కెరీర్ అంటూ ఉద్యోగ ప్ర‌య‌త్నంలో మునిగిపోవ‌టం.. ఆ వెంట‌నే సంపాద‌న మొద‌లెట్టి జీవిత ప‌రుగు పందెన్ని పాతికేళ్ల‌కే షురూ చేసే వారి క‌ష్టాలు అన్నిఇన్ని కావు.

జీవితానికి జీతం ఒక్క‌టే ముఖ్యం కాదు. కానీ.. ఆ విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఐటీ ఉద్యోగి అన్నంత‌నే ఒక అసూయ క‌నిపిస్తుందే త‌ప్పించి వారి ఈతిబాధ‌లు ఎవ‌రికి ప‌ట్ట‌వు. నిన్న‌టినిన్న (సోమ‌వారం) వారు ప‌డిన వేత‌న‌.. వేద‌న తెలిస్తే అయ్యో అనుకోవాల్సిందే.

గ‌డిచిన కొద్దిరోజులుగా హైద‌రాబాదీయుల‌కు చుక్క‌లు చూపిస్తున్న వ‌ర్షం మండే (అక్టోబ‌రు 9) కూడా మంట‌పుట్టేలా చేసింది. వీకెండ్ ముగిసి.. వీక్ మొద‌టి రోజు ఆఫీసుకు వెళ్లిన వారంతా అడ్డంగా బుక్ అయ్యారు. సోమ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల నుంచి వ‌ర్షం కొద్దికొద్దిగా ప‌డితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇర‌గ‌దీసింది. ముఖ్యంగా సైబ‌రాబాద్ ప‌రిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు.. ప‌టాన్ చెరువు మొద‌లుకొని మూసాపేట వ‌ర‌కూ జోరున వ‌ర్షం కురిసింది.

చిన్న చినుక్కే చిత్త‌డి అయ్యే హైద‌రాబాద్‌.. భారీ వ‌ర్షానికి త‌ట్టుకుంటుందా? అంటే త‌ట్టుకోలేదనే చెప్పాలి. సాయంత్రం షురూ అయిన వ‌ర్షం అంత‌కంత‌కూ పెరిగింది. ఎప్ప‌టిలానే లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌టం..డ్రైయినేజీల్లోని నీళ్లు పోక రోడ్డు మీద భారీ ఎత్తున వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌టం.. రోడ్ల మీద ప‌డిన గుంట‌లు.. మోకాలి పైకే వ‌చ్చిన వాన నీరు వ‌చ్చిన వేళ‌.. వాహ‌నాలు అడుగు తీసి అడుగు వేయ‌లేక‌పోయాయి. దీంతో.. ఆఫీసుల నుంచి ఇళ్ల‌కు బ‌య‌లుదేరి ఉద్యోగులు ఇంటికి చేర‌టానికి జ‌స్ట్ ఐదారు గంట‌లు వాన‌లో త‌డిచిపోవాల్సి వ‌చ్చింది.

మ‌రికొంద‌రి ప‌రిస్థితి అయితే మ‌రింత దారుణం. ఆఫీసుల చుట్టూ వాన నీరు క‌ప్పేయ‌టంతో బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ట్రాఫిక్ తో బుక్ అయ్యారు. మొత్తంగా పాడు వానతో సోమ‌వారం ఎక్కువ‌మంది ఐటీ జీవులు రాత్రి పన్నెండు గంట‌ల‌కు చేరుకోగా.. మ‌రికొంద‌రు అర్థ‌రాత్రి రెండు గంట‌ల వ‌ర‌కూ ఇంటికి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. వ‌ర్షంతో న‌గ‌ర‌జీవికి న‌ర‌మ‌న్నది మామూలే అయినా.. ఈ మండే మాత్రం మొత్తంగా మంటెత్తిపోయేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.