Begin typing your search above and press return to search.

నామా ప్రేమాయ‌ణం..ఎన్నిక‌ల ముందు క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   23 Nov 2018 1:25 PM GMT
నామా ప్రేమాయ‌ణం..ఎన్నిక‌ల ముందు క‌ల‌క‌లం
X
ఖమ్మం తహశీల్దార్ ఆఫీస్ దగ్గర హైడ్రామా నడిచింది. ఖమ్మం మాజీ ఎంపీ - ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుంకర సుజాత మరోసారి ఫిర్యాదు చేశారు. ఖమ్మం ఎన్నికల అధికారిని కలిసి రాత పూర్వక ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన సందర్భంగా సుజాతతో ఖమ్మం కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేందర్ వాగ్వాదానికి దిగారు. పదే పదే ఆమెను అడ్డగిస్తూ వారించారు. ప్రజాకూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు వ్యక్తిగత వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. గతంలోనే ఈ విషయం మీడియాలో రావడం - సోషల్ మీడియాలో నామా తిట్ల పురాణం ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఖమ్మం ప్రజలు నామా ఇది నీకు తగునా..? అని చర్చించుకోవడం నామా వ్యక్తిగత ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తంకావడం జరిగింది. గతంలో హైదరాబాద్ నగరంలో ఘటన జరుగగా గురువారం ఖమ్మం జిల్లాకేంద్రంలో అది కూడా మధుకాన్ సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సదరు మహిళ వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది

ప్రముఖ పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు రాష్ట్రంలోనే ప్రముఖ వ్యక్తి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాన కోటరీల్లోని కొద్దిమంది వ్యక్తుల్లో నామా ఒకరు. ఇరురాష్ర్టాల్లోనే కాకుండా దేశంలో - ప్రపంచంలోని పలుదేశాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న నాయకుడు. రాజకీయాల్లో ప్రవేశించిన కొద్ది సమయంలోనే తనకున్న అంగ - అర్ధబలంతో ఉన్నత స్థానానికి చేరుకోగలిగాడు. 2009ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికైన నాయకుడు నామా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా నామా కొనసాగారు. ఆ సమయంలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఏర్పడిన విబేధాల కారణంగా ఖమ్మంజిల్లాలో తుమ్మల - నామా వర్గాలుగా తెలుగుదేశం విడిపోయింది. అనంతరం జరిగిన రాష్ట్ర విభజన - 2014ఎన్నికల్లో నామా - తుమ్మల ఓటమి జరిగింది. ఈక్రమంలో తుమ్మల టీఆర్ ఎస్‌ లో చేరగా అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తనకున్న వ్యాపార సామ్రాజ్యంలో మధుకాన్ సంస్థ ప్రముఖమైనది. ఆ సంస్థలో హైదరాబాద్ నగరానికి చెందిన సుంకర సుజాత అనే మహిళ సబ్‌ కాంట్రాక్టర్‌ గా పనిచేస్తూ వచ్చింది. స్టేజ్-1 కాంట్రాక్టర్ కావడంతో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు సుజాతకు ఇవ్వడం జరుగుతోంది. దాదాపు పది సంవత్సరాలుగా సుజాత మధుకాన్ సంస్థలో కాంట్రాక్టర్‌ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే సుజాతతో నామాకు అవినాభావ సంబంధం ఏర్పడింది, తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడని ఆయనతో ఉన్న చనువు కారణంతో ఫొటోలు కూడా దిగామని - వీటిని ఆసరాగా చేసుకొని తనను బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సుజాత బహిరంగంగానే గతంలో పేర్కొన్నది. హైదరాబాద్‌ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుజాత నామాపై ఫిర్యాదు కూడా చేసింది. అప్పట్లో ఈ విషయం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఇదే సందర్భంలో నామా నాగేశ్వరరావు సుజాతను సెల్‌ ఫోన్లో తిట్టిన బూతు పురాణం సోషల్ మీడియాలోనూ హల్‌ చల్ చేసింది. ఆ తరువాత కొద్దికాలానికి ఆ విషయం సద్దుమణిగింది. తిరిగి ఇప్పుడు వెలుగులోకి రావడం మళ్లీ చర్చనీయాంశమైంది.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి తరుపున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి - ప్రముఖ పారిశ్రామికవేత్త - మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్‌ కు చెందిన సుంకర సుజాత అనే మహిళ గురువారం ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. తాను గతంలో నామాకు చెందిన మధుకాన్ సంస్థలలో కాంట్రాక్టర్‌ గా పనిచేశానని ఆ సమయంలో అతనితో సఖ్యతగా ఉండటం జరిగిందని, ఆ సందర్భంగా తనతో ఉన్న ఫొటోలను నా భర్తకు - నాపిల్లలకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని - అంతేకాకుండా ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేంద్రతో కూడా బెదిరించారన్నారు. గతంలోనే హైదరాబాద్‌ లోని పోలీస్‌ స్టేషన్‌ లో నామాపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు తన ఎన్నికల అఫిడవిట్‌ లో తానుపెట్టిన కేసుల వివరాలను పొందుపరచలేదని అందుకనే నేను ఫిర్యాదు చేస్తున్నానన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు తాము పొందుపరిచే అఫిడవిట్‌ లో కేసుల వివరాలు సెక్షన్‌ లతో సహా వివరించాల్సిన ఉండగా నామా నాగేశ్వరరావు కేవలం సెక్షన్‌ లను మాత్రమే పొందుపరిచాడు కానీ కేసుల వివరాలు అఫిడవిట్‌ లో ఇవ్వలేదని ఆరోపించారు. కనుక నామాపై చర్య తీసుకోవాలని అధికారికి ఫిర్యాదు చేశారు.