Begin typing your search above and press return to search.

మైదుకూరు : మేయర్ కుర్చీ ఎవరిది..జనసేన మద్దతు టీడీపీకా?వైసీపీకా?

By:  Tupaki Desk   |   15 March 2021 8:50 AM GMT
మైదుకూరు : మేయర్ కుర్చీ ఎవరిది..జనసేన మద్దతు టీడీపీకా?వైసీపీకా?
X
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా కూడా సీఎం సొంత జిల్లా , మైదుకూరు లో మొత్తం టీడీపీ గట్టి పోటీనిచ్చి నిలబడింది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 12 చోట్ల విజయం సాధిస్తే… 11 చోట్ల వైసీపీ క్యాండిడేట్స్‌ గెలిచారు. జనసేనకు ఒక వార్డు లభించింది. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు , అధికార పార్టీకి ఒక్క సీటే తక్కువైంది.మేయర్‌ కుర్చీలో కూర్తొనేది ఎవరు, సీటు ఎవరికి, స్వీటు ఎవరికి ఇదే చర్చ ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. లాండ్‌ స్లైడ్‌ విక్టరీతో చాలా మంది మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

టీడీపీ మెజార్టీ స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించినా, చైర్మన పీఠం అధిష్టించాలంటే మరో ఇద్దరి మద్దతు అవసరం. ఒక వార్డులో గెలిచిన జనసేన మద్దతు ఇచ్చినా, ఒకరి మద్దతు కావాలి లేదా టై ఎదుర్కోవాలి. దీంతో అందరి దృష్టి మైదుకూరుపై పడింది. అయితే , జనసేన అభ్యర్థి మద్దతు కూడగట్టుకోవడం లేదా గైర్హాజరు అయ్యేలా చేసి చైర్మన పీఠం దక్కించుకోవాలని అధికార పార్టీ కీలక నాయకులు అప్పుడే వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గత ఏడాది వచ్చినప్పటి నుండి హాట్ టాపిక్ గానే ఉంది. అసలు మైదుకూరు లో పోటీ లేకుండా చేయాలనీ వైసీపీ నేతలు ఎంతగా ప్రయత్నం చేసినా కూడా మొత్తం 24 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయించడంతో పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ చైర్మన అభ్యర్థి ధనపాల జగన వ్యూహాత్మకంగా సక్సెస్‌ అయ్యారు. ఆ తరువాత పురపోరు ప్రక్రియ మొదలైనా టీడీపీ అభ్యర్థులను వితడ్రా చేయించి మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడానికి వైసీపీ నాయకుల ప్రయత్నాలను అడ్డుకొని ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకుండా చూసుకున్నారు. వైసీపీ నేతలు ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా రాజకీయ ఎత్తులతో పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధిగమిస్తూ పట్టణ పోరులో 12 వార్డులు గెలుచుకుని పెద్దపార్టీగా అవతరించారు.

అయితే.. 24 వార్డులతో పాటు స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా మున్సిపాలిటీలో ఓటు ఉంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి కూడా ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఈ మున్సిపాలిటీలో ఉండేందుకే కలెక్టరుకు లెటర్‌ ఇచ్చారని జిల్లా అధికారులు అంటున్నారు. అంటే.. 24 మంది కౌన్సిలర్లతో పాటు ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులు కలిపి కౌన్సిల్‌ లో 26 ఓట్లు ఉన్నట్లు లెక్క. 18న జరిగే చైర్మన ఎంపికలో 26 మందికి ఓటు హక్కు ఉంటుంది. 14 మంది ఎవరికి ఓటు వేస్తే వారే చైర్మన అవుతారని అధికారులు తెలిపారు. వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులు కలిపి 13 ఓట్లు ఉన్నాయి. టీడీపీ 12 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. ఒక వార్డులో గెలిచిన జనసేన కౌన్సిలర్‌ వైసీపీకి మద్దతు ఇచ్చినా.. 18న జరిగే కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరైనా వైసీపీ చైర్మన పీఠం దక్కించుకుంటుంది. ఒకవేళ జనసేన కౌన్సిలర్‌ టీడీపీకి మద్దతు ఇస్తే ఇరుపార్టీలకు 13 ఓట్లు చొప్పున సమంగా ఉంటాయి. అప్పుడు ఎన్నికల అధికారి టై వేస్తారు. ఇది అదృష్టంపై ఆధారపడుతుంది. జనసేనతో పాటు టీడీపీకి చెందిన ఒకరిద్దరు కౌన్సిలర్లను 18న సమావేశానికి రాకుండా చేసేందుకు వైసీపీ అప్పుడే రాజకీయ ఎత్తులకు పదును పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పురపోరు ముగిసినా.. చైర్మన్ ఎంపిక హాట్ట టాపిక్‌ గా మారింది.