Begin typing your search above and press return to search.

చెన్నై టు బెంగ‌ళూరు.. జ‌స్ట్‌ 30 నిమిషాలు

By:  Tupaki Desk   |   16 Jan 2017 10:43 AM GMT
చెన్నై టు బెంగ‌ళూరు.. జ‌స్ట్‌ 30 నిమిషాలు
X
టెక్నాలజీ ఫ‌లాల్లో ఇది పీక్స్ ఆవిష్క‌ర‌ణ‌. చెన్నై టు బెంగ‌ళూరు.. జ‌స్ట్‌ 30 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. విమానంలోనా అనుకుంటున్నారా? ఊహ‌ల్లో అంత‌కన్నా కాదు.. నేల‌పైనే. అమెరికాకు చెందిన‌ హైప‌ర్‌ లూప్ వ‌న్‌ కు సార‌థి ఎలోన్ మ‌స్క్ మ‌స్తిష్కం నుంచి వ‌చ్చిన ఆలోచ‌న ఇది. ఊహ‌కంద‌ని కొత్త ట్రాన్స్‌పోర్ట్ విధానంలో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌డానికి ఈ సంస్థ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఓ ట్యూబ్ ద్వారా పాడ్స్ (రైళ్లు)లో గంట‌కు 1200 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు. కాంక్రీట్ పిల్ల‌ర్స్‌పై ఈ ట్యూబ్‌ ను నిర్మిస్తారు. ట‌న్నెల్‌ లోని శూన్యంలో ఇది తేలుతూ వెళ్తుంది కాబ‌ట్టి.. ఈ రైళ్ల‌కి ఆ వేగం అందుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఇదే సాధ్య‌మైతే చెన్నై నుంచి బెంగ‌ళూరుకు 30 నిమిషాల్లో - ముంబైకి గంట‌లో ప్రయాణించ‌వ‌చ్చు. ఈ మ‌ధ్యే ఈ సంస్ధ త‌మ‌కు ఆస‌క్తి ఉన్న రూట్ల‌పై ట్వీట్ చేసింది. బెంగ‌ళూరు-చెన్నై - చెన్నై-ముంబై - బెంగ‌ళూరు-తిరువ‌నంత‌పురం - ముంబై-ఢిల్లీ మ‌ధ్య ఈ ట్యూబ్ ట్రాన్స్‌ పోర్ట్‌ ను నిర్మించాల‌నుకుంటున్న‌ట్లు చెప్పింది.

ఈ విష‌య‌మై అనుమ‌తి కోసం హైప‌ర్‌ లూప్‌.. కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా మంత్రిత్వ శాఖ‌ను కూడా సంప్ర‌దించింది. అయితే ఇవే రూట్ల‌లో బుల్లెట్ ట్రైన్స్ న‌డ‌పాలన్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే జ‌పాన్‌ - చైనా బృందాలు చెన్నై - బెంగ‌ళూరు రూట్లో హైస్పీడ్ ట్రైన్స్ కోసం ట్రాక్‌ పై అధ్య‌య‌నం చేస్తున్నాయి. తాము బ‌స్ టికెట్ ధ‌ర‌కే ప్ర‌యాణికులను చేర‌వేస్తామ‌ని హైప‌ర్‌ లూప్ అంటోంది. తాము ట్రాన్స్‌ పోర్ట్‌ కు చార్జ్ చేయ‌మ‌ని, కేవ‌లం తీసుకున్న స‌మ‌యానికే ధ‌ర నిర్ణ‌యిస్తామ‌ని ఆ సంస్థ చెప్పింది. ముందుగానే త‌యారైన ట్యూబ్ల‌ను పిల్ల‌ర్ల‌పై ఏర్పాటుచేస్తామ‌ని కంపెనీ తెలిపింది. దీనివ‌ల్ల నిర్మాణానికి అయ్యే వ్యయం - స‌మ‌యం చాలావ‌ర‌కు ఆదా అవుతుంది. ఇంధ‌నం కోసం ట్యూబ్స్‌ పైన సోలార్ ప్యానెల్స్‌ - పిల్ల‌ర్ల‌పై విండ్‌ మిల్స్ ఏర్పాటుచేయ‌డం వ‌ల్ల దీని నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. ఆ పాడ్స్ అయ‌స్కాంత వ్య‌వ‌స్థ ఆధారంగా ముందుకు క‌దులుతాయి. ఇవి స్టార్ట్ అయ్యే స‌మ‌యంలోనే ఇంధ‌నాన్ని వాడుకుంటాయి. ఒక్క‌సారి అత్య‌ధిక వేగాన్ని అందుకున్నాయంటే 320 కిలోమీట‌ర్లు ఏక‌ధాటిగా ప్ర‌యాణించ‌గ‌ల‌వు. ప్ర‌పంచంలోనే తొలి ట్యూబ్ రూట్ వ‌చ్చే ఐదేళ్ల‌లో దుబాయ్‌ - అబుదాబి మ‌ధ్య రానుంది. ప్ర‌స్తుతం ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణానికి 90 నిమిషాలు ప‌డుతుండ‌గా.. అది 12 నిమిషాల‌కు త‌గ్గుతుంది.

అయితే ఈ ట్యూబ్ ట్రాన్స్‌పోర్ట్ అంత సులువు కాద‌ని భార‌తీయ రైల్వే ఇంజినీర్లు అంటున్నారు. ఇది సాకారం కావాలంటే ద‌శాబ్దాల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఓ సీనియ‌ర్ అధికారి చెప్పారు. నిజానికి కిలోమీట‌ర్ హైస్పీడ్ లైన్‌ కు 300 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. అయితే హైప‌ర్‌ లూప్ మాత్రం తాము రూ.72 కోట్ల‌తోనే పూర్తి చేస్తామ‌ని చెబుతోంది. ఇంత ఖ‌ర్చు పెట్టి టికెట్ ధ‌ర‌ల విష‌యంలో ప్ర‌భుత్వంతో పేచీ త‌ప్ప‌ద‌ని కూడా ఆ రైల్వే అధికారి హెచ్చ‌రిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/