Begin typing your search above and press return to search.

నేను జయలలిత కుమార్తెను .. అందుకే అప్పుడు రాలేకపోయాయి !

By:  Tupaki Desk   |   6 Nov 2021 2:30 PM GMT
నేను జయలలిత కుమార్తెను .. అందుకే అప్పుడు రాలేకపోయాయి !
X
తమిళనాడు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె తానేనంటూ చెన్నైలోని ఆమె సమాధి వద్ద ఓ మహిళ హడావిడి చేసింది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రేమ.. మెరీనా తీరంలోని జయలలిత సమాధి దగ్గర నివాళ్లు అర్పించారు. దీపావళి సందర్భంగా అమ్మ సమాధి వద్ద ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. అయితే భద్రతా సిబ్బంది తనను అమ్మ సమాధిని దర్శించుకునేందుకు అనుమతివ్వలేదని వాపోయారు. ఆ తర్వాత అనుమతి తీసుకోని మరుసటి రోజు అమ్మ సమాధిని దర్శించుకున్నట్లు తెలిపారు.

తన స్వస్థలం మైసూరు అని చెప్పింది. గత 30 ఏళ్లుగా చెన్నైలోని పల్లావరం ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నానని,.ఇక్కడికి రాకూడదని తాను భావించానని, కానీ, అమ్మ జ్ఞాపకాలతో మనోవేదన ఎక్కువ అవుతున్నందున సమాధిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. జయలలిత కుమార్తె అయితే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, దానికి కారణాలు ఉన్నందునే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జయలలిత కుమార్తె తానేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఒక శుభదినాన్ని ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. చట్టబద్ధంగానూ తాను జయలలిత కుమార్తెగా నిరూపించే పక్కా ఆధారాలు తన దగ్గరున్నట్లు తెలిపారు.

తనను పెంచిన తండ్రి, మైసూరులో ఉండేవారని, ఇటీవల ఆయన మరణించినట్లు చెప్పుకున్నారు. త్వరలోనే తాను శశికళను కలవనున్నట్లు వెల్లడించారు. శశికళను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించినట్లు తెలిపిన ఆమె, మూడు నాలుగు రోజుల్లోనే ఆమె కలుస్తానని వెల్లడించారు. జయలలిత పోయస్ గార్డెన్‌ లోని ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి నేరుగా వెళ్లి కలిసినట్లు ఆ మహిళ తెలిపారు. ఆ తర్వాత ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మరోసారి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆమెను కలిసినట్లు వెల్లడించారు. తనకు తెలిసి రెండుసార్లు మాత్రమే జయలలితను నేరుగా కలిసినట్లు తెలిపారు. తన పేరు ప్రేమ.. అయితే అమ్మ ముద్దుగా తనను జయలక్ష్మి అని పిలిచేవారని ఆమె చెప్పింది. జయలలిత మరణం తర్వాత తాను తీవ్ర మనోవేధనతో ఉన్నందునే.. ఇన్ని రోజులు బయటకు రాలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. చాలా ప్రశ్నలకు త్వరలోనే చెబుతా, త్వరలోనే మీకు తెలుస్తుందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.