Begin typing your search above and press return to search.

చంద్రబాబులా విసిగించను..అధికారులకు జగన్ హామీ!

By:  Tupaki Desk   |   25 May 2019 11:41 AM GMT
చంద్రబాబులా విసిగించను..అధికారులకు జగన్ హామీ!
X
తనను కలిసిన అధికారులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి పని విషయంలో జగన్ వారికి ఒకే భరోసా ఇచ్చారట. 'పని వేళల్లో మాత్రమే పని.. వర్కింగ్ అవర్స్ అయిపోయాకా మీరు ఇంటికి వెళ్లి పోవచ్చు..' అని అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుల వరకూ సమీక్షల పేరుతో విసిగించేది ఉండదని, అర్థం లేని సమీక్షలు, కూర్చోబెట్టి చెప్పిందే చెప్పడం ఉండదని జగన్ అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

ఇది వరకూ చంద్రబాబు నాయుడు పాలనలో అసలు విషయం తక్కువ, సమీక్షలు ఎక్కువ.. అన్టన్టుగా ఉండేది వ్యవహారం అనే పేరుంది. చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, ఇటీవల ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా.. సమీక్షల పేరుతో అధికారులను విసిగించేశారనే కామెంట్ వినిపించింది.

చంద్రబాబు నాయుడు అలా సమీక్షించడం గొప్ప అని అనుకున్నారు. ఆ విషయాలను తెలుగుదేశం పార్టీ వాళ్లు ఘనంగా చెప్పుకున్నారు. ఆఖరికి లోకేష్ కూడా తన తండ్రి రాత్రి పదీ పదకొండు వరకూ సెక్రటేరియట్ లోనే ఉంటూ హడావుడి చేసేవారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం వాళ్లు అదంతా గొప్ప అనుకున్నారు కానీ.. అలాంటి హడావుడితో వచ్చే ప్రయోజనం కన్నా ఉద్యోగులను అలా విసిగిస్తే జరిగే నష్టమే ఎక్కువ అని ఎన్నికల ఫలితాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

అధికారులతో చంద్రబాబు ఒక రేంజ్ లో సమీక్షలు నిర్వహించేస్తున్నారనే ప్రచారం వచ్చినా ప్రజలు చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయలేదంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు జగన్ చాలా స్పష్టతతోనే కనిపిస్తూ ఉన్నారు. అధికారులను విసిగించేది ఉండదని ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే వారికి భరోసాను ఇచ్చినట్టుగా తెలుస్తోంది.