Begin typing your search above and press return to search.

కాబోయే మినిస్టర్ నేనే... ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 9:05 AM GMT
కాబోయే మినిస్టర్ నేనే... ?
X
మంత్రి పదవి అంటే మోజే. అందరికీ ఆ పెద్ద కుర్చీయే కావాలి. ఒకసారి మంత్రి అనిపించుకుంటే చాలు. మాజీ మంత్రిగా లైఫ్ లాంగ్ ట్యాగ్ తో దర్జాగా బతికేయవచ్చు. అందుకే ఎమ్మెల్యే అయిన ప్రతీ ఒక్కరూ మంత్రి పదవి కోసం అర్రులు చాస్తారు. అక్కడ ఉన్నది జగన్. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన కూడా తన మనసులో భావాలను ఎవరితో పంచుకోరు. అయితే ఆయనకు విన్నపాలు చేసుకున్న వారు, నివేదించుకున్న వారు మాత్రం చాలా పెద్ద ఆశలే పెట్టుకుంటున్నారు. జగన్ తమకే పదవి ఇస్తారని వారు గట్టి ధీమాతో ఉండడమే విశేషం.

ఇక్కడ సమీకరణలు, లెక్కలు అన్నీ కూడా తమకు అనుకూలంగా చూసుకుంటూ వేసుకుంటూ మనకు కాక ఇంకెవరికీ మినిస్టర్ సీటు దక్కేది అంటూ నిబ్బరం పోతున్నారు. ఆ విధంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి మంత్రి పదవి నాదే అంటున్నారు. జగన్ కి తాను ఇష్టుడినని, తనకు మొదటి దఫాలోనే చాన్స్ రావాలని, అయితే నాడున్న పరిస్థితుల్లో ఇవ్వలేకపోయారని, ఈసారి డ్యామ్ ష్యూర్ అని అనుచరులతో తన ఆనందాన్ని పంచుకుంటున్నట్లుగా ప్రచారం అవుతోంది.

ఇంతకీ కోలగట్లకు మంత్రి పదవి ఎలా దక్కుతుంది. ఆయనకు ఉన్న చాన్సెస్ ఏంటి అన్నది చూసుకుంటే అదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను కచ్చితంగా తప్పిస్తారు అన్న వార్తలే ఆశలు రేపుతున్నాయని అనుకోవాలి. ఇక బొత్స కాకపోతే తానే సీనియర్ అని కూడా కోలగట్ల భావిస్తున్నారుట. వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల కచ్చితంగా ఈసారి కులం కూడా తనకు ప్లస్ అవుతుంది అని భావిస్తున్నారుట. ఇదే సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఈసారి ఉండదని కూడా అంచనాలు ఉన్న నేపధ్యంలో తనకే ఇక మంత్రి కుర్చీ అని ఆయన తెగ సంబరపడుతున్నారుట.

మరో వైపు చూస్తే వైసీపీ పెట్టిన తరువాత తొలిసారిగా పార్టీలో చేరిన వారిగా కోలగట్లకు జగన్ వద్ద మంచి గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతే జగన్ వదిలేయకుండా ఎమ్మెల్సీని చేసి మరీ గుర్తింపు ఇచ్చారు. ఇక విజయనగరం జిల్లాలో మొదటి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకే ఇచ్చారు. జగన్ అలా కోలగట్ల పట్ల ఎప్పటికపుడు తన ప్రేమను చాటుకుంటున్నారు. ఇక బొత్సను తప్పించాలనుకున్నపుడు సమర్ధుడు సీనియర్ అయిన కోలగట్లకే మినిస్టర్ అయ్యే యోగం దక్కుతుంది అని కూడా ఆయన అనుచరులు అంటున్నారు. ఈ మేరకు తనకు బలమైన సంకేతాలు కూడా ఉన్నాయని కోలగట్ల వర్గం చెప్పుకుంటోంది. వచ్చే సంక్రాంతి లోగా కాబోయే మినిస్టర్ తానే అని కూడా కోలగట్ల ధీమాగా ఉన్నారంటే కాస్తా ఆలోచించాల్సిందే మరి.