Begin typing your search above and press return to search.

వందేళ్లకోసారి వచ్చే ఈ సంక్షోభం ఎలా ఎదుర్కోవాలో తెలియదు: మోడీ

By:  Tupaki Desk   |   30 May 2021 7:40 AM GMT
వందేళ్లకోసారి వచ్చే ఈ సంక్షోభం ఎలా ఎదుర్కోవాలో తెలియదు: మోడీ
X
ప్రతి ఆదివారం ‘మన్ కీ బాత్’ పేరిట తన మనసులో గూడుకట్టుకున్న అంతటిని బయటపెట్టే ప్రధాని మోడీ తాజాగా ఈ ఆదివారం కరోనా సంక్షోభంపై మాట్లాడారు. రేడియోలో తన ఊసులు పంచుకున్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ లాంటి మహమ్మారులు.. సంక్షోభ పరిస్థితులు వందేళ్లకోసారి ఏర్పడుతుంటాయని.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఎవరికీ తెలియదని ప్రధాని మోడీ అన్నారు. ఈ విషయంలో అనుభవం లేదని మోడీ చెప్పారు. అయినప్పటికీ దేశ ప్రజలు కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము ఎప్పుడూ ఎదుర్కోని పరిస్థితుల్లోనూ వెన్ను చూపట్లేదని అన్నారు. తొలి విడతలో కరోనా వైరస్ పై ఘనవిజయాన్ని సాధించామని.. అలాంటి గెలుపును మళ్లీ త్వరలోనే అందుకోబోతున్నామని మోడీ చెప్పారు.

ఇక ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న దేశానికి వాయుసేన పైలెట్లు, రైల్వే సిబ్బంది చేరవేస్తున్నారని.. వారి సేవలను మోడీ కొనియాడారు. కరోనా టెస్టులు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను మోడీ ప్రశంసించారు. డాక్టర్లు,నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్ల సేవలను గుర్తించాలన్నారు.

ఇక తన మన్ కీ బాత్లో ఏపీలోని విజయనగరం మామిడి పండ్ల గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. కిసాన్ రైళ్ల వల్ల వేర్వేరు ప్రాంతాలకు చెందిన పంట దిగుబడులు దేశవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ మన దేశ రైతులు భారీ దిగుబడులు తెచ్చారని కొనియాడారు.