Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ణి పట్టించుకోం కానీ...రోజూ ప్రెస్ మీట్లూ...ట్వీట్లూ...

By:  Tupaki Desk   |   18 Nov 2022 10:30 AM GMT
పవన్ కళ్యాణ్ణి పట్టించుకోం కానీ...రోజూ ప్రెస్ మీట్లూ...ట్వీట్లూ...
X
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షార్ట్ కట్ లో పీకే. ఆయన అంటే వైసీపీకి భయమా లేక కలవరమా లేక భయంతో కూడిన కలవరంతో వచ్చిన బెంబేలా. అంటే ఇవన్నీ కలిపి కూడిటీ వచ్చినది కరెక్టే అని చెప్పాలేమో అంటున్నారు. ఎందుకంటే ఏపీలో వైసీపీ నేతలకు మరో పని ఉన్నట్లుగా తోచదు. తెల్లారిలేస్తే పవన్ కళ్యాణ్ మీదనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అలాగే ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఫుల్ డే అలా పవన్ కే కేటాయించేస్తున్నారు.

నిజానికి పవన్ వీకెండ్ పొలిటీషియన్ అని, ఆయనకు రాజకీయాలు తెలియవు అని నిలకడ లేని రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు అంటారు. అంతే కాదు ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని, ఆయనతో తమకు పనేంటి అని కూడా గొప్పగా చెబుతూ ఉంటారు కానీ నిజానికి చూస్తే ప్రతీ రోజూ పవన్ నామస్మరణ ఎక్కువగా చేసేది మాత్రం వైసీపీ నాయకులే అని చెప్పకతప్పదు.

నిజానికి పవన్ ప్రయారిటీని ఒక విధంగా పెంచుతున్నది కూడా వైసీపీయే. ఇక్కడ వారు ఒక లాజిక్ ని మరచిపోతున్నారు. ఎవరిని అయితే ఎక్కువగా టార్గెట్ చేస్తారో ఎవరి మీద అయితే రోజుకి పది సార్లు పడి ఏడుస్తారో వారికి జనాల్లో భయంకరంగా మరో వైపు గ్రాఫ్ పెరిగిపోతూ ఉంటుంది. ఎంత బలంగా నేలకేసి కొడితే అంతలా లేచే బంతి మాదిరిగా ఒక నాయకుడి విషయంలో చేసే చర్యలకు ప్రతిచర్యలు దారుణంగా ఉంటాయి.

మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ నేతలు తమను తాము ఆపులేకపోతున్నారు. ఎందుకు ఆయన్నే పట్టుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు అంటే ఇక్కడ కచ్చితంగా ఒక్కటి చెప్పుకోవాలి. అదే పవన్ కళ్యాణ్. ఆయన ఇమేజ్. ఆయన గ్లామర్. అది సినీ గ్లామర్ తో పాటు వ్యక్తిగతంగా ఆయన జనాల్లో పెంచుకున్న గ్లామర్ ఇవన్నీ కలసి ఏపీలో జనసేన కదుపు కుదుపూ ఒక రేంజిలో ఉంటుందని అర్ధమయ్యే వైసీపీ నేతలు ఆయన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఎవరెంత టార్గెట్ చేసినా పవన్ ఇంకా బలపడుతూనే ఉంటారు కదా. ఆయన ఒక్క రోజు మీటింగ్ పెడితే వారానికి సరిపడా కవరేజి ఇచ్చేస్తూ రోజూ ట్వీట్లు చేసేస్తూ తప్పుడు వ్యూహాలతో వైసీపీ ముందుకు సాగిపోతోంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. పవన్ పట్ల జనాల్లో సానుభూతిని పెంచడమే కాకుండా ఆయన గురించి అంతా ఎక్కువగా చర్చించుకునే విధంగా వైసీపీ స్ట్రాటజీస్ ఉన్నాయని అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఎంత చెప్పుకున్నా వైసీపీకి భయం ఉంది అని అంటున్నారు. 2014 ఎన్నికలు దానికి కారణం అని చెబుతున్నారు. ఆనాడు నోటి దాకా వచ్చిన కూడుని కొట్టినట్లుగా అధికారం మాదే అని చాలా ఆశలతో ఉన్న వైసీపీని దెబ్బతీసింది పవన్ మార్క్ ఇమేజ్. ఆయన పోటీ చేయలేదు. కేవలం జస్ట్ పొలిటికల్ సీన్ లో కనిపించాడు అంతే. ఆయన సడెన్ ఎంట్రీతో వైసీపీ ఏం కాదులే అని లైట్ తీసుకున్నా చివరకు వైసీపీ ఆట చిరిగి చేట అయింది.

అలా వైసీపీ కుర్చీ ఆశలను పడక్కుర్చీలో పడేసి పాతిపెట్టేసిన పవన్ అంటే వైసీపీకి భయమే అని అంటారు. ఇక 2014తో పోలిస్తే ఏపీ జనాల్లో గణనీయమైన మార్పు వైసీపీ విషయంలో వచ్చింది. నాడు జగన్ మీద ఉన్న సానుభూతి అంతా 2019 ఎన్నికల్లో ఓట్ల వర్షంగా కురిసి 151 సీట్లతో పవర్ లోకి వచ్చేశారు. మూడున్నరేళ్ల పాలన పూర్తి ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా సాగింది.

ఇక దిద్దుబాట్లకు కూడా టైం లేని పరిస్థితి ఉంది. దాంతో 2024 ఎన్నికలు అంటే ఒక విధంగా వైసీపీకి వెన్నులో వణుకు అనే అంటున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ రూపంలో మరో భారీ ఓటమి తమకు పొంచి ఉందని వైసీపీ కలర్వపడుతోందా అంటే ఆ పార్టీ డైలీ ప్రోగ్రాం కింద పెడుతున్న ట్వీట్లూ, ప్రెస్ మీట్లూ దానికి నిదర్శనం అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే అంటే వణుకే అనిపించేలా వైసీపీలో సీన్ ఉంది అంటున్నారు. మరి అది కాదు అని చెప్పాలంటే వారు ఆయన పేరు తలచుకోవడం బాగా తగ్గించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.