Begin typing your search above and press return to search.

డోక్లాంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ద‌లైలామా

By:  Tupaki Desk   |   9 Aug 2017 1:46 PM GMT
డోక్లాంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ద‌లైలామా
X
కొద్దిరోజులుగా భార‌త్‌.. చైనాల మ‌ధ్య ర‌గులుతున్న డోక్లాం వ్య‌వ‌హారం రోజులు గ‌డుస్తున్న కొద్దీ మ‌రింత‌గా ముద‌రుతోంది. డ్రాగ‌న్ ఏం చేసినా చెల్లుతుంద‌న్న రోజులు పోయాయ‌ని.. విస్త‌ర‌ణ కాంక్ష వ్యాపారానికి ఉండొచ్చు కానీ సామ్రాజ్య కాంక్ష ఏమాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని చైనాకు అర్థ‌మ‌య్యేలా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది భార‌త స‌ర్కార్‌. భూటాన్ స‌రిహ‌ద్దు అయిన డోక్లాంలో తిష్ట వేయ‌టం ద్వారా భార‌త్ గుండెల మీద గురి పెట్టాల‌న్న దుష్ట ఆలోచ‌న‌ను గుర్తించిన మోడీ స‌ర్కారు.. గత ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా.. దృడంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

సిక్కిం స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన భూటాన్ ట్రై జంక్ష‌న్ వ‌ద్ద చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని భార‌త్ అడ్డుకోవ‌టంపై చైనా ర‌గిలిపోతోంది. తానేం చేసినా స‌రిహ‌ద్దు దేశాలు చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ట్లుగా ఉండే డ్రాగ‌న్ దుర్మార్గ బుద్ధికి ఊహించ‌ని రీతిలో షాకిచ్చిన భార‌త్ తీరుతో చైనా గుర్రుగా ఉంది.

భార‌త్ త‌న తీరును మార్చుకోక‌పోతే యుద్ధం త‌ప్ప‌దంటూ మైండ్ గేమ్ మొద‌లెట్టిన వేళ‌.. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసేలా చైనా మీడియా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో.. ప‌రిస్థితి అంత‌కంత‌కూ సీరియ‌స్ గా మారుతోంది. ఇలాంటి వేళ‌.. ఈ ఉదంతంపై బౌద్ద‌గురువు.. ప్ర‌ముఖ అధ్యాత్మిక‌వేత్త ద‌లైలామా రియాక్ట్ అయ్యారు.

భార‌త్ - చైనా వివాదం అస‌లు పెద్ద స‌మ‌స్య కాదంటూ ద‌లైలామా సింఫుల్ గా తీసి పారేశారు. ఈ రెండు దేశాలు ఎప్ప‌టికీ సోద‌ర దేశాలే అన్న ఆయ‌న‌.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఉద్రిక్త‌త‌లు ఏర్ప‌డిన‌ప్పుడు హిందీ.. చీనీ భాయి భాయి అంటూ ఇరు దేశాలు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

డోక్లాం ఎపిసోడ్‌లో భార‌త్ అనుస‌రిస్తున్న తీరుపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ద‌లైలామా.. స్వేచ్ఛ ఉండే చోటునే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌న్నారు. భార‌త్ లో ఉన్న స్వేచ్ఛ‌ను ఇష్ట‌ప‌డ‌తాను కాబ‌ట్టే.. ఇండియాను త‌న సొంతిల్లులా భావిస్తాన‌న్నారు. భార‌త్ లో స్వేచ్ఛ ఉండ‌టంతోనే తన అభిప్రాయాల్ని న‌లుగురితో స్వేచ్ఛ‌గా పంచుకోగ‌లుగుతున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. చైనా ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా చైనా క‌మ్యూనిస్ట్ పార్టీ ప్ర‌జాస్వామ్య విలువ‌ల్ని ఆనుస‌రిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఇరుదేశాల మ‌ధ్య మాట‌లు హ‌ద్దులు మీరుతున్నాయ‌ని.. 1962లో చైనా సైన్యం బోమ్ డిల్లా స‌మీపంలోకి వ‌చ్చాయ‌ని.. ఆ త‌ర్వాత వెనుదిరిగిన విష‌యాన్ని ద‌లైలామా గుర్తు చేశారు.