Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ కు రూ.100 కోట్ల అప్పులు

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:41 AM GMT
ఫైర్ బ్రాండ్ కు రూ.100 కోట్ల అప్పులు
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ ఫైర్ బ్రాండ్లలో ఒకరైన జగ్గారెడ్డి.. తనకు సంబంధించిన ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని చెప్పే తన దగ్గర ఆస్తులు లేవని.. ఆ మాటకు వస్తే రూ.100 కోట్ల అప్పుటు ఉన్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచారు. తనకు కార్యకర్తలు.. నేతలే అప్పులు ఇస్తారని చెప్పిన ఆయన.. వాటితోనే రాజకీయాలు.. సేవా కార్యక్రమాలు చేస్తుంటానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేయటంతో పాటు.. దేనికైనా సరే అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయన తర్వాతి కాలంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు.

అప్పటి నుంచి కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటంతో దూకుడుగా వ్యవహరిస్తూ.. తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదని చెబుతున్న జగ్గారెడ్డి.. తాజాగా అందుకు భిన్నమైన వాదనను వినిపించారు.

తనను ఎన్నుకున్న సంగారెడ్డి ప్రజల కోసం దేనికైనా సిద్ధమని.. సీఎం కేసీఆర్ ముందు తల వంచటానికైనా రెఢీ అన్నారు. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినంతనే.. తాజాగా తన దగ్గర ఆస్తులు లేవని.. రూ.100 కోట్ల అప్పులు ఉన్నట్లు చెప్పారు. అంత అప్పు ఉన్నప్పటికీ తన వద్దకు సాయం కోసం వచ్చే వారికి చేతనంతన సాయం చేస్తుంటానని చెప్పారు.

తాను చెబుతున్నవన్నీ అబద్ధాలు కావన్న రీతిలో.. తాను ఎవరెవరి దగ్గర ఎంతెంత మొత్తం తీసుకున్నానన్న విషయాన్ని సమావేశంలోని పలువురు నేతల్ని పిలిచి.. వారి నోటి నుంచి చెప్పించటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన దసరాకు తాను రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు. వంద కోట్ల అప్పులు ఉన్న తర్వాత కూడా ఇంత దర్జాగా బతికేయటం.. దాన ధర్మాలు చేయటం జగ్గారెడ్డి మాష్టారికే సాధ్యమవుతుందని చెప్పక తప్పదు.