Begin typing your search above and press return to search.

తొలిసారి రాహుల్ ను ఎత్తుకున్న న‌ర్సు ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   1 May 2019 11:55 AM GMT
తొలిసారి రాహుల్ ను ఎత్తుకున్న న‌ర్సు ఏం చెప్పారంటే?
X
ఈ ప్ర‌పంచం చాలా పెద్ద‌ద‌ని అనిపిస్తుంది కానీ.. ఎంతో చిన్న‌ద‌న్న విష‌యం కొన్ని విష‌యాల్ని చూస్తే ఇట్టే అనిపించ‌క మాన‌దు. ఎక్క‌డ ఢిల్లీ.. ఎక్క‌డ వ‌య‌నాడ్‌. ఎక్క‌డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఎక్క‌డ వ‌య‌నాడ్ లోని ఒక మామూలు న‌ర్సు. ఇంత‌కీ రాహుల్ కు.. వ‌య‌నాడ్ లోని 72 ఏళ్ల న‌ర్స‌మ్మ‌కు మ‌ధ్య అనుబంధం ఏమిటి? అన్న‌ది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ట‌మే కాదు.. కాసింత భావోద్వేగానికి గురి కావ‌టం ఖాయం.

రాహుల్ గాంధీ జ‌న్మించిన‌ప్పుడు తొలిసారి ఆ ప‌సికందును ఎత్తుకున్న మొట్టమొద‌టి వ్య‌క్తి ఈ న‌ర్స‌మ్మ‌. ఆమె పేరు రాజ‌మ్మ వ‌వాతిల్. ఆమెకు ఇప్పుడు 72 ఏళ్లు. వ‌య‌నాడ్ లో ఉన్న ఆమె.. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు బోలెడ‌న్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పుకొచ్చారు. 48 ఏళ్ల క్రితం త‌న చేతుల‌తో ఎత్తుకున్న చిన్నారి.. ఈ రోజు తాను ఉండే ప్రాంతానికి ఎంపీగా పోటీ చేయ‌టాన్ని ఆమె తీవ్ర‌మైన భావోద్వేగానికి గుర‌వుతున్నారు.

రాహుల్ గాంధీ జ‌న్మించిన‌ప్పుడు లేబ‌ర్ రూంలో న‌ర్సుగా ప‌ని చేసిన ఆమె.. నాటి సంగ‌తుల్ని.. ఆమె కుటుంబ స‌భ్యుల గురించి చెప్ప‌ట‌మే కాదు.. రాహుల్ గాంధీకి చెప్పాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని చెప్పారు. ఈ విష‌యం కానీ రాహుల్ కు తెలిస్తే.. ఆమెను క‌ల‌వ‌టం ఖాయం. ఇంత‌కీ.. ఆమె చెప్పిన సంగ‌తులు చూస్తే..

+ 48 ఏళ్ల క్రితం నా చేతుల‌తో తొలిసారి ఎత్తున్న బిడ్డ‌.. ఈ రోజున నేనున్న ప్రాంతానికి ఎంపీగా పోటీ చేస్తార‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రాహుల్ వ‌య‌నాడ్ వ‌స్తార‌ని క‌ల‌లో కూడా భావించ‌లేదు.

+ అప్ప‌ట్లో నాకు 23 ఏళ్లు ఉంటాయి. న‌ర్సింగ్ డిగ్రీ చేసి హోలీ ఫ్యామిలీ ఆసుప‌త్రిలో న‌ర్సుగా చేరా. గాంధీ కుటుంబంలోకి కొత్త స‌భ్యుడు వ‌స్తున్న వైనాన్ని మేం ఎంతో ఆస‌క్తితో ఎదురుచూశాం. ఆసుప‌త్రిలోని సిబ్బంది అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశాం.

+ అది 1970 జూన్ 19 అనుకుంటా.. ప్రధానమంత్రి మనవడు జన్మించడంతో మేమంతా ఎలాంటి ఉద్వేగంతో నిండిఉంటామో మీరు ఊహించుకోవచ్చు. అందరూ సంభ్రమాశ్చర్యంలో మునిగితేలారు. రాహుల్ చూడముచ్చటగా ఉన్నారు. మేమంతా చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాం. ఆయన తల్లిదండ్రులకంటే ముందు మేమే ఆయనను చూశాం.

+ సోనియా గాంధీ సెలబ్రిటీ అయినప్పటికీ.. ఆ కుటుంబం ఆస్పత్రి రూల్స్ కు కట్టుబడి సహకరించారు. భద్రతా ఏర్పాట్లతో కూడా మాకెలాంటి ఇబ్బందీ రానివ్వలేదు. సోనియా గాంధీకి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం నేను లేబర్ రూంలోకి వెళ్లి ఆమెను కలుసుకున్నా. ఆమె చక్కగా సహకరించారు. నార్మల్ డెలివరీ అయ్యింది.

+ మా బృందంలో నర్సులు, పీడియాట్రిషియన్లు, వైద్యులు ఉన్నారు.లేబర్‌ రూమ్‌లోకి వచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అనుమతి ఇచ్చినప్పటికీ రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు బయటే నిలబడి వేచిచూశారు. అప్పుడా ఇద్దరూ తెల్లటి కుర్తాలు ధరించి ఉన్నారు. పాట్నా పర్యటనలో ఉన్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ... మూడు రోజుల తర్వాత మనవడిని చూడడానికి వచ్చారు.

+ ఆసుప‌త్రిలో ప‌ని చేసిన త‌ర్వాత కొన్నాళ్లు అహ్మదాబాద్‌లో ఆర్మీలో ప‌ని చేశా.1987లో కేరళకు తిరిగివచ్చా. రాహుల్ ఇప్పుడు వయనాడ్ నుంచి పోటీచేయడం నాకెంతో ఆనందాన్ని క‌లిగించింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న మ‌న‌మ‌డ్ని క‌లుసుకోలేక‌పోయా. దీనికి బాధ‌గా ఉంది.

+ సాధ్యమైనంత త్వరగా నేను ఆయనను కలుసుకోవాలనుకుంటున్నాను. ఆయనతో నేను చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. తన నానమ్మ, తల్లి కూడా ఈ విషయాలు ఆయనతో చెప్పలేదనుకుంటా. నువ్వు ఎలా జన్మించావు... నీ కళ్లు తెరిచినప్పుడు ఎవరు నిన్ను ముందుగా చూశారు? ప్రధాని మనవడైన నిన్ను మేమంతా ఎలా పిలుచుకున్నాం.. ఇలాంటి విశేషాలెన్నో ఆయనతో పంచుకోవాలి. నా ఓటు ఎవ‌రికి వేస్తానా?.. నా మ‌న‌మ‌డికి ఓటు వేయ‌క‌పోతే నేను ఇంకెవ‌రికి ఓటు వేస్తాను?