Begin typing your search above and press return to search.

ఆ ఎస్ఐ వల్లే నా భార్యను హత్య చేశా

By:  Tupaki Desk   |   12 April 2021 4:20 AM GMT
ఆ ఎస్ఐ వల్లే నా భార్యను హత్య చేశా
X
గుంటూరు జిల్లాలో ఇటీవల భార్యను హత్య చేసిన ఉదంతం కీలక మలుపు తిరిగింది. తన భార్యను హత్య చేయటానికి కారణం.. తనను అరెస్టు చేసిన ఎస్ఐనే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. భార్యను హత్య చేసిన భర్తను పది రోజుల పాటు గాలించి పట్టుకున్న వైనం ఒక ఎత్తు అయితే.. తాజా ఆరోపణ పోలీసు శాఖలో సంచలనంగా మారింది. ఇంతకూ..ఆ భర్తకు భార్యను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్న ప్రశ్నకు నిందితుడు చెబుతున్న సమాధానం షాకింగ్ గా మారింది.

జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి హత్యకు గురైన మహిళతో తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. తాగుడుకు బానిసైన భర్త భార్యతో తరచూ గొడవ పడేవాడు. అనుమానంతో హింసించేవాడు. అతడి వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది ఫిర్యాదు చేయటానికి.ఆ క్రమంలో స్టేషన్ లోని ఎస్ ఐతో ఆమెకు పరిచయం పెరిగింది. అది కాస్తా పెరిగి. తరచూ ఫోన్ లో ఛాటింగ్ చేస్తుండేవాడు.

ఈ విషయాన్ని పసిగట్టిన భర్త.. ఆమెను మందలించేవాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించేవాడు. దీంతో.. ఎస్ఐ భర్తను స్టేషన్ కు పిలిపించి.. ఆమె పెట్టిన కేసు విచారణ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. దీనికి తోడు.. సదరు మహిళ తన భర్తపై అదే పనిగా కేసులు పెడుతూ ఉండేది. కాపురానికి కూడా రాకుండా ఉండటంతో విసిగిపోయిన భర్త.. మానసికంగా కుంగిపోయి దీనంతటికి కారణమైన భార్యను చంపేయాలని నిర్ణయించుకొన్నాడు. అందులో భాగంగానే తన భార్యను హత్య చేసినట్లుగా నిందితుడు చెప్పటం చర్చనీయాంశంగా మారింది.

దీనికి తోడు.. ఈ హత్య ఉదంతంలో నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శించటం కొత్త సందేహాలకు తావిస్తోంది. హత్య కేసును తానే డీల్ చేస్తానని.. నిందితుడ్ని పట్టుకొస్తానని చెప్పి పట్టుకున్న వైనం పోలీసు శాఖలో ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.