Begin typing your search above and press return to search.

బిజెపి అధికారంలోకి వస్తే రాజకీయ వ్యూహకర్తగా పని చెయ్యటం మానేస్తా : పీకే !

By:  Tupaki Desk   |   3 March 2021 11:01 AM GMT
బిజెపి అధికారంలోకి వస్తే రాజకీయ వ్యూహకర్తగా పని చెయ్యటం మానేస్తా : పీకే !
X
దేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొంది. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలకి ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికారం కోసం నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ లో వచ్చేది మమత ప్రభుత్వమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటానని, వేరే పని చూసుకుంటానని అన్నారు. బీజేపీకి వందకుపైగా సీట్లొస్తే నేను నా పని వదిలేస్తా. ఐపీఏసీనీ వదిలి వెళ్లిపోతా అని అన్నారు.

తాను అన్నది జరగకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకీ సలహాలు సూచనలు ఇవ్వనని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో మా అంచనాలు తప్పాయి. మేం ఓడిపోయాం. మేం అనుకున్నది చేయలేకపోయాం. కానీ, బెంగాల్ లో అలాంటి పరిస్థితి లేదు. గెలిచేందుకు చేయాల్సిందంతా నేను చేస్తున్నాను. ఆ విషయంలో దీదీ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఒకవేళ బెంగాల్ లో ఓడిపోతే ఆ పనికి అసమర్థుడినని నేను ఒప్పుకొంటా అని ఆయన అన్నారు. బెంగాల్ లో 200 సీట్లు గెలుస్తామని అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, అది కేవలం తృణమూల్ పార్టీ నేతల్లో భయం సృష్టించడానికేనని అన్నారు.ప్రధాని మోదీ తప్ప వారి సభలు, సమావేశాలకు కనీసం 200 నుంచి 300 మంది జనాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ తనంతట తాను పతనమైతే తప్ప బెంగాల్ లో బీజేపీ గెలవలేదని స్పష్టం చేశారు. తృణమూల్ పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని, వాటిని బీజేపీ సొమ్ము చేసుకుంటోందని అన్నారు. తృణమూల్ నుంచి భారీగా వలసలు పెరుగుతాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఇది వారి వ్యూహాల్లో ఒకటని అన్నారు. ఇతర పార్టీల నేతలకు ఎరవేసి లాక్కుంటారని ఆరోపించారు. తన వల్లే పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. తాను పనిచేస్తున్నది స్నేహితులను చేసుకోవడానికి కాదన్నారు. పార్టీని గెలిపించేందుకు మాత్రమే పనిచేస్తున్నానని చెప్పారు. పార్టీ గెలుపు కోసం పని చేస్తున్న క్రమంలో కొంతమందికి నచ్చకపోవచ్చు అని పీకే అన్నారు.