Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి వేదిక‌గా ఆస్తుల‌పై క్లారిటీ ఇచ్చిన ప‌వ‌న్

By:  Tupaki Desk   |   12 March 2018 8:09 AM GMT
అమ‌రావ‌తి వేదిక‌గా ఆస్తుల‌పై క్లారిటీ ఇచ్చిన ప‌వ‌న్
X
జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా త‌న కార్యక‌లాపాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. హైదరాబాద్‌ లో ఉంటూ ఇంతకాలం తెలుగు రాష్ట్రాల్లో జనసేన కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ‌రావ‌తిలో పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో జనసేనాని కొత్త ఇల్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం వేద పండితులతో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. కొంత మంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉండగా సాంప్రదాయ బద్ధమైన వస్త్రాలు ధరించి పవన్ - ఆయన సతీమని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. `మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్‌ గా పనిచేశారు. మా నాన్న ఉద్యోగం చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం సంతోషంగా ఉంది` అని అన్నారు. త‌న రాజ‌కీయ‌ ప్ర‌యాణంపై త‌న‌కు చాలా స్పష్టత ఉందని తెలిపారు. `నా అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోను… సమస్యల నుంచి పారిపోను` అని స్పష్టం చేశారు. `నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఎవరినీ వెనుకేసుకురాను. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అమ‌రావ‌తిలో ఇల్లు నిర్మిస్తున్నా`అని తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం - బీజేపీ - టీడీపీతో అనుసరించాల్సిన విధానంపై ఈ నెల 14న క్లారిటీ ఇస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకొక్క రోజు వేచి ఉండాల‌ని ఆయ‌న చ‌మ‌త్క‌రించారు.

త‌న‌ ఆస్తులు ఎవరినీ దోచేసినవి కావని జనసేన అధినేత పవన్ కల్యాణ్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. `నేను కష్టపడి సంపాదించుకున్నా. ప్రజలిచ్చిన ఆస్తులు… కొన్ని సార్లు పోగొట్టుకున్నా మళ్లీ తిరిగి సంపాదించుకున్నాను. నా ఆస్తుల వివరాలన్నీ ఐటీ రిటర్న్స్‌లో ఉంటాయి. ప్రత్యేకంగా ప్రకటించాల్సిన పని లేదు.కానీ, అవసరం వస్తే ఆస్తులు ప్రకటిస్తా` అని అన్నారు. కొత్త వ్యక్తులను పార్టీలోకి తీసుకోవాలనే ఉద్దేశం ఉంద‌న్నారు. `ఇప్పటికే నిర్వహించిన సదస్సులతో జిల్లాల వారీగా కొంతమందిని ఎంపిక చేశాం… తొలి విడతగా 12 మందితో స్పీకర్ ప్యానెల్‌ ని రెడీ చేశాం.` అని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని తాను ఏనాడూ వమ్ము చేయబోనని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు తాను అన్ని రకాలుగా శ్రమిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీకి ప్రజల సహకారం ఉండాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరుకున్నారు.