Begin typing your search above and press return to search.

40మందిని గెలిపిస్తా.. కోమటిరెడ్డి సంచలనం

By:  Tupaki Desk   |   7 Sep 2018 11:38 AM GMT
40మందిని గెలిపిస్తా.. కోమటిరెడ్డి సంచలనం
X
ముందస్తు ఎన్నికల వేడిని కేసీఆర్ రగిల్చారు. దీంతో ఎవరికి వారు అలెర్ట్ అవుతున్నారు. సైలెంట్ గా ఉంటున్నవారు పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు తెరమీదకు తెచ్చారు. కొద్ది సేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అభివృద్ధి కోసం కేసీఆర్ ను గెలిపించాలంటూ టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు మరో గాసిప్ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతున్నాడని.. కాంగ్రెస్ కు హ్యాండిచ్చి టీఆర్ ఎస్ లో చేరిపోయాడని వార్తలు వెలువడ్డాయి.

దీనిపై మనస్థాపం చెందిన ఆయన నేరుగా బయటకు వచ్చాడు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత నిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకునే ఈ ఎత్తు వేశాడని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధమేనని ప్రకటించారు. మునుగోడు నుంచి నా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి - నల్గొండ నుంచి తాను పోటీచేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే తాము ప్రచారం ప్రారంభిస్తామని కోమటిరెడ్డి చెప్పారు. తాను గెలవడమే కాదు.. 40 మందిని గెలిపించే సత్తా తమకు ఉందని చెప్పారు.

ఎన్నికల్లో గెలవలేననే భయంతోనే కాంగ్రెస్ నేత - మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాదు త్వరలోనే టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఖాయమని జోస్యం చెప్పారు.