Begin typing your search above and press return to search.

వ‌స్తానంటే.. వ‌ద్దంటామా!

By:  Tupaki Desk   |   11 Feb 2022 7:30 AM GMT
వ‌స్తానంటే.. వ‌ద్దంటామా!
X
తెలంగాణ రాజ‌కీయాల‌పై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఇక్క‌డ పార్టీ బ‌లోపేతమ‌య్యే అవ‌కాశం ఉంది కాబట్టి హైక‌మాండ్ కూడా అందుకు త‌గిన విధంగా ముందుకు సాగుతోంది. అధికార టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెడుతోంది.

కేసీఆర్‌కు దీటుగా స‌వాలు విసురుతోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టి పార్టీలో చేరిక‌ల‌ను భారీగా ప్రోత్స‌హిస్తోంది. అందు కోసం తెలంగాణ బీజేపీ ప్ర‌త్యేకంగా ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నుంచి నేత‌లు బీజేపీలోకి వ‌రుస క‌డుతున్నారు. దీంతో ఈ అవ‌కాశాన్ని మ‌రింత సద్వినియోగం చేసుకోవాల‌ని పార్టీ భావిస్తోంది.

కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగ‌రేసి బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యంతో షాకిచ్చిన ఈట‌ల రాజేంద‌ర్ స్పూర్తితో మ‌రికొంత మంది కాషాయ పార్టీవైపు చూస్తున్నారు.

ఇటీవ‌ల తుక్కుగూడ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ కూడా కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో ఆ మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో చేరింది. మ‌రోవైపు ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న నాయ‌కుల‌ను చేర్చుకోవ‌డానికి బీజేపీ స‌న్నాహ‌కాలు చేస్తోంది. గురువారం కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంత‌మంది టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీలో బీజేపీలో చేరారు.

మ‌రోవైపు క్షేత్రస్థాయిలో ఇత‌ర పార్టీల నేత‌ల‌ను చేర్చుకోవ‌డంపై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ విష‌యంపై చ‌ర్చించ‌డానికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.. చేరిక‌లు, స‌మ‌న్వ‌య క‌మిటీతో ఈ నెల 12న స‌మావేశం కానున్నారు.

రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు న‌ల్లు ఇంద్ర‌సేనారెడ్డి ఛైర్మ‌న్‌గా కేవ‌లం చేరిక‌ల కోస‌మే ఓ క‌మిటీ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లు రాష్ట్ర రాజ‌కీయాలు మారిన నేప‌థ్యంలో చేరిక‌ల‌పై పార్టీ ఫోక‌స్ పెట్టింది. మ‌రోవైపు జిట్టా బాల‌కృష్ణారెడ్డి, రాణి రుద్ర‌మ‌దేవి ఆధ్వ‌ర్యంలోని యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసే మూహుర్తం కూడా ఖ‌రారైంది. ఈ నెల 16న యువ తెలంగాణ పార్టీ విలీనం ఉంటుంద‌ని బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.