Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి ఆఖ‌రికి ఇలా డిసైడ‌య్యారు

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:20 PM GMT
కోమ‌టిరెడ్డి ఆఖ‌రికి ఇలా డిసైడ‌య్యారు
X
కాంగ్రెస్ పార్టీ ఫైర్‌ బ్రాండ్ నేత‌ - ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌లి కాలంలో కీల‌క ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న కోమటిరెడ్డి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటమిపాల‌యిన సంగ‌తి తెలిసిందే. మ‌హాకూట‌మిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు వస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థిగా బ‌రిలో దిగిన‌ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. నల్లగొండ నుంచి అయిదో విజయం కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలుకాగా, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో తమ్ముడు ఇన్‌.. అన్న అవుట్‌ అన్న వ్యాఖ్యలు వినిపించాయి.

కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నతాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాన‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ వారి మధ్యే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. త్వ‌రలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గోండ పార్లమెంట్ స్ధానానికి పోటీ చేస్తానని, అందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఒప్పుకున్నారని తెలిపారు. కొద్ది రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువమంది సర్పంచ్ లను గెలుచుకునేలా కృషిచేయాలని కోమటిరెడ్డి కార్యకర్తలను కోరారు. గత ప్రభుత్వం సర్పంచ్ లకు నిధులు ఇవ్వలేదని - కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా ఇతర పధకాలకు మళ్ళించిందని ఆయన తెలిపారు.