Begin typing your search above and press return to search.

గోడ కోసం ఎంత‌కైనా తెగిస్తానంటున్న ట్రంప్‌!

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:10 AM GMT
గోడ కోసం ఎంత‌కైనా తెగిస్తానంటున్న ట్రంప్‌!
X
వివాదాస్ప‌ద - సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు మారుపేరైన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే బాట‌లో మ‌రో అనూహ్య‌ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మెక్సికోతో స‌రిహ‌ద్దుల్లో గోడ నిర్మాణం కోసం ప‌ట్టుప‌డుతున్న ట్రంప్‌.. అందుకోసం ఎంత‌కైనా తెగిస్తాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి త‌న పంతం నెగ్గించుకుంటానంటున్నారు.

దేశంలోకి అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అడ్డుకునేందుకుగాను మెక్సికోతో ద‌క్షిణ స‌రిహ‌ద్దుల్లో గోడ నిర్మిస్తాన‌ని ట్రంప్ చాన్నాళ్లుగా చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఈ విష‌యం పైనే ఎక్కువ‌గా ప్ర‌చారం చేశారు. అమెరికాను మ‌ళ్లీ గ్రేట్ గా చేస్తాన‌ని - మెక్సికో స‌రిహ‌ద్దుల్లో గోడ క‌డ‌తాన‌ని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వ‌చ్చాక గోడ నిర్మాణం విష‌యంలో ట్రంప్ కు డెమోక్రాట్ల నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. ఆ మాట‌కొస్తే సొంత రిప‌బ్లిక‌న్ పార్టీలోని చాలామంది నేత‌లూ ఆ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించారు. అయిన‌ప్ప‌టికీ ట్రంప్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. గోడ నిర్మాణం కోసం 5.6 బిలియ‌న్ డాల‌ర్లు కేటాయించాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. అమెరికా చ‌ట్ట‌స‌భ - కాంగ్రెస్ అందుకు నిరాక‌రించ‌డంతో ఇటీవ‌ల సంక్షోభం త‌లెత్తింది. ప్ర‌భుత్వం ష‌ట్ డౌన్ అయింది. ప‌లు కీల‌క ప్ర‌భుత్వ విభాగాల‌కు 22 రోజులుగా నిధులు నిలిచిపోయి.

ప్ర‌భుత్వం ష‌ట్ డౌన్ అయినా ట్రంప్ వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. గోడ కోసం ఎంత‌కైనా తెగిస్తానంటున్నారు. స‌రిహ‌ద్దుల్లో గోడ నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయ‌డంలో కాంగ్రెస్ ఆవ‌శ్య‌క‌త లేకుండా చేసేందుకుగాను దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఎమ‌ర్జెన్సీలో దేశాధ్య‌క్షుడికే స‌ర్వాధికారాలుంటాయి. ఆయ‌న ఇష్ట‌పూర్వ‌కంగానే నిధుల కేటాయింపు జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఎమ‌ర్జెన్సీ విధించి స‌రిహ‌ద్దు గోడ నిర్మాణం కోసం నిధులు కేటాయించుకోవాల‌ని ట్రంప్ యోచిస్తున్నారు. ఎమ‌ర్జెన్సీ విధించే ప్ర‌క్రియ‌లో చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి స‌వాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ తాజాగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే త‌న న్యాయ‌వాదులు వాటి పై క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలిపారు.