Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో వ‌స్తా.. అంద‌రినీ క‌లుస్తా: మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:30 AM GMT
త్వ‌ర‌లో వ‌స్తా.. అంద‌రినీ క‌లుస్తా: మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటలకు ఎక్కారు.. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. తమను చికాకులకు గురి చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పట్ల, వైఎస్‌ జగన్‌తో అంటకాగుతున్న నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పట్ల కఠినంగానే వ్యవహరించారు.. కిరణ్‌. కానీ అటు జగన్‌ను ఆపలేకపోయారు. ఇటు తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించలేక చేతులెత్తేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రంలోని కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) పేరుతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని తన స్థానం పీలేరు నుంచి బరిలోకి దింపారు. అయితే.. జేఎస్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. చివరికి తన సొంత తమ్ముడిని తన ఇలాకాలోనూ గెలిపించుకోలేకపోయారు.

దీంతో అప్పటి నుంచి రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుని సైలెంట్‌ అయిపోయారు. మధ్యలో జనసేన పార్టీలో చేరతారని వార్తలు వచ్చినా నిజం కాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 నుంచి దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల నుంచి ఇటీవ‌ల‌ పిలుపు వచ్చింది. సోనియా, రాహుల్ గాంధీల‌తో భేటీ అయ్యారు. మ‌రోమారు ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని వారు కిర‌ణ్ ను కోరార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జూన్ 22న చిత్తూరు జిల్లా కలికిరిలో ప‌ర్య‌టించారు. త‌న ఒక‌ప్ప‌టి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు అంద‌రినీ పేరుపేరునా ప‌ల‌క‌రించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కేఎస్‌ అఘామోహిద్దీన్‌, జిల్లా కాంగ్రెస్‌ మాజీ కార్యదర్శి డాక్టర్‌ శ్రీవర్ధన్‌, పలువురు నాయకులు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులను పేరుపేరునా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వచ్చిన కుమారుడు నిఖిలేష్‌కుమార్‌రెడ్డిని అందరికీ పరిచయం చేశారు.

అలాగే మ‌ద‌న‌ప‌ల్లెలో మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డిని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. న‌రేష్ కుమార్ రెడ్డి ఇటీవ‌ల ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డటంతో ఆయ‌న చేతికి గాయ‌మైంది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత మదనపల్లెలోని ఇంటికి చేరుకున్నారు. దీంతో మదనపల్లె బైపాస్‌ రోడ్డులో నివాసముంటున్న నరేష్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కిర‌ణ్ ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ పనుల నిమిత్తం కలికిరికి వచ్చినట్లు సమాచారం. త‌న సొంత ఊరు కలికిరిలో అందరినీ పలకరించిన ఆయన ‘త్వరలో వస్తా.. అందరితో కలుస్తా.. అందుబాటులో ఉంటా.. అప్పుడు అందరం కూర్చోని మాట్లాడుకుందాం’ అని చెప్పార‌ని స‌మాచారం. అనంతరం ఆయ‌న‌ కలికిరి నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. మొత్తానికి కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం, మునుప‌టిలా యాక్టివ్ కావ‌డంతో ఆయ‌న ఇక క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఉంటార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.