Begin typing your search above and press return to search.

క్రికెటర్ పొలిటికల్ కెరీర్ ను రాహుల్ రక్షిస్తాడా?

By:  Tupaki Desk   |   30 April 2019 4:30 PM GMT
క్రికెటర్ పొలిటికల్ కెరీర్ ను రాహుల్ రక్షిస్తాడా?
X
మొన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ పార్టీ రాజకీయాలను బాగానే ఒంటపట్టించేసుకున్నాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ భారత మాజీ క్రికెటర్ చాలా సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో నేతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో ఆ పార్టీలో పడకపోవడంతో సిద్ధూ కాంగ్రెస్ లో చేరారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిన ఈ క్రికెటర్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో కీలక పదవిని ఆశించారు. అయితే అది దక్కలేదు. మంత్రి పదవి అయితే దక్కింది. అప్పటి నుంచి లౌకికవాదిగా సాగుతూ ఉన్నారు ఈ పంజాబీ పుత్తర్.

ఇక కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ మీద ఈ క్రికెటర్ గొప్ప భక్తిని చూపుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పాత భజన పరులను దాటి పోయినట్టుగా కనిపిస్తున్నాడు సిక్సర్ల సిద్ధూ. తాజాగా ఇతడు ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ ఆశ్చర్యాన్ని కలిగించమానదు.

అమేథీలో రాహుల్ గాంధీ విజయం సాధించి తీరతారు అని సిద్ధూ చెబుతున్నారు. అక్కడి వరకూ చెప్పి ఉంటే బావుండేది. అయితే సిద్దూ మరో అడుగు ముందుకు వేసి.. 'అమేథీలో రాహుల్ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను...' అని ప్రకటించారు. కాంగ్రెస్ లో దశాబ్దాల నుంచి ఉన్న వారు కూడా ఇలా రాహుల్ విజయం మీద సవాళ్లు విసరలేదు. వారిని మించిన పోయిన స్థాయిలో సిద్ధూ రాహుల్ పై భక్తిని చూపుతున్నాడు. మరి సిద్ధూ పొలిటికల్ కెరీర్ ను రాహుల్ రక్షిస్తాడో లేదో! ఫలితాలు వస్తే కానీ తెలియదు!