Begin typing your search above and press return to search.

రాజకీయాలకు సోనియా గుడ్‌ బై..రాహుల్‌ కు ప‌రీక్షే

By:  Tupaki Desk   |   15 Dec 2017 8:16 AM GMT
రాజకీయాలకు సోనియా గుడ్‌ బై..రాహుల్‌ కు ప‌రీక్షే
X
దేశ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఇవాళ ప్రకటించారు. 19 ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేప‌థ్యంలో సోనియా నిర్ణ‌యం వెలువ‌డిన‌ట్లు భావిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా అత్యధిక కాలం సేవలందించి.. యువ నాయకత్వానికి అవకాశమివ్వాలని భావించిన ఆమె.. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటన చేశారు. గత కొద్ది రోజుల నుంచి సోనియాకు ఆరోగ్యం సహకరించని విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏడేళ్లు రాజకీయాలకు గాంధీ కుటుంబం దూరంగా ఉంది. ఏడేళ్ల తర్వాత సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకురాలిగా సోనియా పని చేశారు.

సోనియా హయాంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తుప‌ల్లాల‌ను చ‌వి చూసింది. ప‌లు ద‌ఫాలుగా అధికారంలోకి రావ‌డంతో పాటుగా దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అయితే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 20 శాతం మాత్రమే పాపులర్ ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో మోడీ సార‌థ్యంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే 543 సీట్లలో 8 శాతం మాత్రమే ఆ పార్టీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది అత్యంత పేలవమైన ప్రదర్శన. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సుమారు ఆరు రాష్ర్టాల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం పెద్ద రాష్ర్టాలైన కర్ణాటక - పంజాబ్‌ లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. మరో మూడు చిన్న రాష్ర్టాలు కూడా కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నాయి.

తాజాగా ఫ‌లితాలు వెలువడేందుకు సిద్ధంగా ఉన్న గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల ఎన్నికల్లో ఆ పార్టీ గెలుస్తుందన్న ఆశలు కూడా అంతగా లేవు. స్థూలంగా 2009 నుంచి 2014 వరకు క్రమంగా ప్రజలు కాంగ్రెస్‌ కు దూరం అవుతూ వచ్చారు. ఆ సమయంలో సుమారు 9 శాతం పాపులర్ ఓటును ఆ పార్టీ కోల్పోయింది. వివిధ కులాలు, మైనార్టీల మద్దతును కోల్పోయింది. తమిళనాడులో 1962లో కాంగ్రెస్ చివరిసారి గెలిచింది. వెస్ట్ బెంగాల్‌ లో 1977 నుంచి ఆ పార్టీ అధికారంలో లేదు. ఉత్తరప్రదేశ్ - బీహార్ రాష్ర్టాల్లోనూ ఆ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇదే స‌మ‌యంలో సోనియాగాంధీ ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాహుల్‌ కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని సోనియా నిర్ణ‌యించారు.

రాహుల్ 13 ఏళ్ల క్రితం అమేథీ నుంచి పబ్లిక్ లైఫ్‌ లోకి ఎంటర్ అయ్యారు. కానీ చాన్నాళ్లూ సైలెంట్‌ గానే ఉన్నారు. 2013లో రాహుల్ పార్టీలో రెండవ సీనియర్‌ గా బాధ్యతలు స్వీకరించారు. అయినా అప్పటి నుంచి ఆ పార్టీలో పెద్దగా మార్పురాలేదు. పార్టీలో వ్యవస్థాగత మార్పులకు రాహుల్ కృషి చేశారు. కానీ ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. తాజాగా సోనియా క్రియాశీల రాజకీయాల నుంచి సైడ్ అవ‌డంతో...పార్టీ భారం మొత్తం రాహుల్‌పై ప‌డిన‌ట్ల‌యింది.