Begin typing your search above and press return to search.

శ‌వాల మీద ఓట్లు ఏరుకునుడేంది య‌డ్డి!

By:  Tupaki Desk   |   28 Feb 2019 7:10 AM GMT
శ‌వాల మీద ఓట్లు ఏరుకునుడేంది య‌డ్డి!
X
రాజ‌కీయాలు ప్ర‌జ‌ల సంక్షేమం కంటే అధికారం చుట్టూనే పార్టీలు తిరిగే ద‌రిద్ర‌పు రోజులు ఎప్పుడో వ‌చ్చేశాయి. ప్ర‌తి ప‌నిని ఓటు బ్యాంకు లెక్క‌ల్లో మునిగిన తీరు ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరిగిపోయింది. ఓట్లు ప‌డ‌తాయంటే చాలు ఎంత‌వ‌ర‌కైనా స‌రే వెళ్లేందుకు రాజ‌కీయ నేత‌లు వెనుకాడ‌టం లేదు. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. అనుకోని రీతిలో పుల్వామా ఉగ్ర‌దాడి చోటు చేసుకోవ‌టం.. దానిపై మోడీ స‌ర్కారు కీల‌క‌నిర్ణ‌యాలు తీసుకోవ‌టం తెలిసిందే.

దాయాది తీరుపై ఎప్ప‌టి నుంచో దేశ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ అధికారంలో ఉన్న వారి నిర్ణ‌యాల కార‌ణంగా త‌ప్పుల మీద త‌ప్పులు జ‌రిగిన ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. గ‌త పాల‌కుల‌కు భిన్నంగా మోడీ వ్య‌వ‌హ‌రించ‌టం.. మారిన భార‌త్ ను కొత్త త‌ర‌హాలో చూపించే ప్ర‌య‌త్నం ఆయ‌న చేశారు.

అందులో రాజ‌కీయ కోణం ఉందా? లేదా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. అలాంటి సందేహాల‌కు తావివ్వ‌కుండా అటు దేశ ప్ర‌జ‌లు.. ఇటు విప‌క్షాలు సైతం మోడీ స‌ర్కారుకు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించాయి. ఇలాంటివేళ‌.. అధికార ప‌క్షానికి చెందిన నేత‌లు మ‌రెంత జాగ‌రూక‌తో ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా అధికారం చుట్టూనే తిరిగే వారి ఆలోచ‌న‌లు వారిని ఒక చోట ఉండ‌నివ్వ‌కుండా.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే వ‌ర‌కూ వెళ్లారు.

క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రిగా సుప‌రిచితులు య‌డ్యుర‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. క‌ర్ణాట‌క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తాజా మాట‌లు దేశ వ్యాప్త చ‌ర్చ‌కు తెర తీసేలా మారాయి. పాక్ లోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త్ చేసిన దాడుల‌తో దేశంలో ప్ర‌ధాని మోడీకి పాజిటివ్ వ‌చ్చింద‌ని.. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో దీని ప్ర‌భావం ఉంటుంద‌న్నారు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో మొత్తం 22 స్థానాల్లో 22 స్థానాల్లో బీజేపీ విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌న్న మాట‌ల్ని ఆయ‌న చెప్పారు. పాక్ లో ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ చేసిన మెరుపుదాడుల కార‌ణంగా రానున్న ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుంద‌ని చెప్పారు.

తాజా మెరుపుదాడులు రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌ని చెబుతున్నారు. చిత్ర‌దుర్గ‌లో విలేక‌రుల‌తో మాట్లాడిన య‌డ్యుర‌ప్ప మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవ‌న్నీ బీజేపీకి.. మోడీ బ్యాచ్ కు అన‌వ‌స‌ర‌మైన త‌ల‌నొప్పులు తెచ్చి పెట్టేవే కావ‌టం విశేషం. పాక్ భూభాగంలోకి ప్ర‌వేశించి భార‌త ప్ర‌భుత్వం మూడు తీవ్ర‌వాద శిబిరాల‌ను ధ్వంసం చేయ‌టం.. మోడీకి దేశ వ్యాప్తంగా అనుకూల ప‌వ‌నాలు తెచ్చి పెట్టిన‌ట్లుగా చెప్పారు. దీని ప్ర‌భావం రానున్న ఎన్నిక‌ల్లో ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు.

పుల్వామా ఉగ్ర‌దాడిలో 40 మంది జ‌వాన్లు మ‌ర‌ణిస్తే..దానికి రాజ‌కీయ రంగు పుల‌మ‌టం స‌రికాద‌ని.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వ‌ల్ల మోడీకి సానుకూల‌త వ‌స్తుందో.. రాదోన‌న్న‌ది ప‌క్క‌న పెడితే య‌డ్డి చేసిన తాజా వ్యాఖ్య‌లు మాత్రం మోడీ స‌ర్కారుకు ప్ర‌తికూలంగా మార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. య‌డ్డి మాట‌ల్ని విన్న ప‌లువురు క‌మ‌ల‌నాథులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. య‌డ్డి చేసిన వ్యాఖ్య‌ల్ని ఎలా క‌వ‌ర్ చేయాల‌న్న‌ది త‌మ ముందున్న ల‌క్ష్యంగా వారు వాపోతున్నారు.