Begin typing your search above and press return to search.

సెల‌వుల‌కు వెళ్ల‌ని అభినంద‌న్‌.. ఇప్పుడెక్క‌డంటే?

By:  Tupaki Desk   |   27 March 2019 5:22 AM GMT
సెల‌వుల‌కు వెళ్ల‌ని అభినంద‌న్‌.. ఇప్పుడెక్క‌డంటే?
X
గంట‌ల వ్య‌వ‌ధిలో యావ‌త్ దేశానికే కాదు.. ప్ర‌పంచం మొత్తానికి ప‌రిచ‌యం కావ‌టం చాలా అరుదైన సంద‌ర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. యుద్ధ ఖైదీగా శ‌త్రుదేశానికి దొరికిపోవ‌టం ఒక ఎత్తు అయితే.. అత‌గాడి ధైర్య సాహ‌సాలు ఒక్కొక్క‌టిగా వెలుగు చూడ‌టం మ‌రో ఎత్తు. దీంతో.. తొలుత ఆయ‌న మీద ఉన్న ఫీలింగ్‌ కు భిన్నంగా గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ ప్ర‌జ‌లంతా ఆయ‌న్ను రియ‌ల్ హీరోగా అభిమానించి.. ఆరాధించ‌టం తెలిసిందే. పాక్ యుద్ధ విమానాన్ని త‌రుముకుంటూ వెళ్లి.. దాన్ని కూల్చివేయ‌టం.. ఆ సంద‌ర్భంలో తాను ప్ర‌యాణిస్తున్న యుద్ధ విమానాన్ని ప్ర‌త్య‌ర్థులు కూల్చివేయ‌టం.. పొర‌పాటున పాక్ అధీనంలోని ప్రాంతంలో చిక్కుకొని.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన యుద్ధ ఖైదీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ గురించి మ‌ర్చిపోయి ఉండ‌రు.

ఆయ‌న్ను తిరిగి దేశానికి తిరిగి వ‌చ్చేవ‌ర‌కూ ఎంతో ఉత్కంట‌గా ఎదురు చూసిన దేశం.. కొద్ది రోజుల పాటు ఆయ‌న జ‌ప‌మే క‌నిపించింది. దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల గంట మోగ‌టం.. రాజ‌కీయం ఊపందుకున్న వేళ‌.. ఆయ‌న గురించి వార్త‌లు త‌గ్గిపోయాయి. శ‌త్రుసేన‌ల చేతికి చిక్కిన త‌ర్వాత జ‌రిపే ఆర్మీ అంత‌ర్గ‌త విచార‌ణ ఒక ఎత్తు అయితే.. కూలిపోతున్న యుద్ధ విమానం నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో ఆయ‌నకు గాయాలు కావ‌టం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు వైద్యం చేసిన రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ ఆసుప‌త్రి (న్యూఢిల్లీ) ఆయ‌న్ను నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు. మ‌రి.. వైద్యులు రెస్ట్ తీసుకోవాల‌న్న మాట చెప్పినంత‌నే ఇంటికి వెళ్లిపోయే వారికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు అభినంద‌న్. తాను ఇంటికి వెళ్ల‌న‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. శ్రీ‌న‌గ‌ర్ లోని వాయుసేన క్యాంపులో యుద్ధ విమానాలు.. కోలీగ్స్ తోనే ఉండ‌టానికి డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

నాలుగు వారాల పాటు ఎయిర్ ఫోర్స్ బేస్ లోనే ఉండి.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వైద్య ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నాలుగు వారాల త‌ర్వాత ఆయ‌న‌కు జ‌రిపే ప‌రీక్ష‌ల్లో పాస్ అయితేనే.. ఆయ‌న మ‌ళ్లీ యుద్ధ విమానాల్ని న‌డిపే వీలుంటుంది. విశ్రాంతి వేళ ఇంటికి వెళ్లేందుకు మ‌క్కువ చూప‌కుండా.. బేస్ క్యాంప్ లో ఉండాల‌ని నిర్ణ‌యించుకోవ‌టం.. మ‌ళ్లీ యుద్ధ పైల‌ట్ కావాల‌న్న త‌ప‌న చూస్తే.. అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ క‌మిట్ మెంట్ ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన త‌ర్వాత అనిపించేది ఒక్క‌టే.. యావ‌త్ దేశం ఆయ‌న్ను కీర్తించేందుకు అర్హ‌త నూటికి నూరుపాళ్లు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.