Begin typing your search above and press return to search.

ఒకే ఒక్కడికి ఊహించని రీతిలో భారీ పురస్కారం

By:  Tupaki Desk   |   8 Aug 2019 7:39 AM
ఒకే ఒక్కడికి ఊహించని రీతిలో భారీ పురస్కారం
X
పాక్ వైమానిక దాడుల్ని సమర్థంగా ఎదుర్కోవటమే కాదు.. వారి జెట్ ఫ్లైట్లను వెంటాడుతూ.. ఒకదాన్ని కూల్చేసి.. మరో దాని అంతు చూసే క్రమంలో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తెర మీదకు వచ్చింది.

పాక్ దళాలకు చిక్కినప్పటికీ మనో నిబ్బరాన్ని ప్రదర్శించటమే కాదు.. అతని కమిట్ మెంట్ కు యావత్ భారత్ ఫిదా అయ్యింది. ఓవర్ నైట్ లో అతనో స్ఫూర్తిదాతగా మారిపోయారు. అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో 24 గంటలు గడిచేసరికి భారత్ గడ్డ మీదకు వచ్చిన అభినందన్ రియల్ హీరోగా మారిపోయారు. భారత్ తో సహా ప్రపంచ దేశాలన్ని అభినందన్ ను భారత్ కు పంపాలంటూ పాక్ మీద ఒత్తిడి తీసుకురావటంతో అభినందన్ ను తిరిగి పంపక తప్పలేదు.

ఎయిర్ ఫోర్స్ లో పని చేయాలన్న కాంక్షతో కష్టపడి.. కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని మరీ మరోసారి వింగ్ కమాండర్ గా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే. అలాంటి అభినందన్ కు అత్యుత్తమ పురస్కారాన్ని ప్రకటించే దిశగా భారత్ సర్కారుసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పుడు అతను ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకు వీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

సైన్యంలో పని చేసే వారికి.. విధి నిర్వహణలో వారు ప్రదర్శించే ధైర్య సాహసాలకు పరమ్ వీర చక్ర.. మహా వీర చక్ర.. వీర చక్ర ప్రదానం చేస్తుంటారు. ఈ అత్యుత్తమ పురస్కారాల్లో వీర చక్ర మూడోది. ఆగస్టు 15 సందర్భంగా ఆయన్ను అత్యుత్తమ పురస్కారంతో సత్కరించేందుకు వీలుగా కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.