Begin typing your search above and press return to search.

సంచలనం రేపుతోన్న రోహిత్ వేముల వీడియో!

By:  Tupaki Desk   |   18 Oct 2016 8:11 AM GMT
సంచలనం రేపుతోన్న రోహిత్ వేముల వీడియో!
X
రోహిత్ వేముల ద‌ళితుడు కాదంటూ జ‌స్టిస్ రూప‌న్‌ వాలా క‌మిటీ నివేదిక ఇచ్చిన కొద్దిరోజుల‌కే రోహిత్ వేముల త‌ను ద‌ళితుడే అని చెబుతున్న వీడియో బ‌య‌ట‌ప‌డింది. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌ సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని అతడి స్నేహితులు స్పష్టం చేశారు. తాను దళితుడినని రోహిత్ స్వయంగా చెప్పుకున్న వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రోహిత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టానికి వారం ముందు ఈ వీడియోను షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

వీడియోలోని రోహిత్ వేముల... "అంద‌రికీ న‌మ‌స్కారం.. నాపేరు రోహిత్ వేముల‌.. నేను గుంటూరు నుంచి వ‌చ్చాను.. నేను గుంటూరు జిల్లాకు చెందిన ద‌ళితుడిని.. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ 2010 నుంచి విద్యార్థిగా ఉంటున్నాను.. సోషల్ సైన్స్ - సామాజిక అంశాలపై ఉన్న నాకున్న ఆసక్తితో నా సబ్జెక్ట్ ను బయోటెక్నాలజీ నుంచి సోషియాలజీకి మార్చుకున్నాను. ప్ర‌స్తుతం సోష‌ల్ సైన్సెస్‌ డిపార్ట్‌ మెంట్ లో పీహెచ్‌ డీ చేస్తున్నాను.. నాతోపాటు ఐదుగురు ద‌ళిత విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేస్తూ యూనివ‌ర్శిటీ అధికారులు రీసెంట్ గా నిర్ణ‌యం తీసుకున్నారు. వియార్థులమైన మమ్మల్ని హాస్ట‌ల్ నుంచి స‌స్పెండ్ చేశారు. క్యాంపస్ లో కానీ, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ వద్ద కానీ మేము క‌నిపిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామని మాకిచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.. ఇక నా వ్యక్తిగత కుటుంబ విష‌యానికొస్తే నేను రోజుకూలీ చేసుకునే కార్మికుడి కొడుకును. మా అమ్మ నన్ను పెంచింది. ఏబీవీపీతో నాకున్న విబేధాలు ఈనాటివి కావు. ఏబీపీకి చెందినవారు 2012లోనే నాపై ఫిర్యాదుచేయగా నన్ను చందానగర్ పోలీస్ స్టేష‌న్‌ లో రెండురోజులు ఉంచారు” అంటూ ఆ వీడియోలో మాట్లాడారు.

ఈ విషయాలపై స్పందించిన రోహిత్ వేముల స్నేహితుడు - అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు మున్నా సాన్నాకీ... రోహిత్ దళితుడు అనేందుకు ఈ వీడియో సాక్షమని.. రోహిత్ కులంపై తలెత్తున్న పశ్నలకు సమాధానంగా ఈ వీడియోకు బయటకు విడుదల చేశామని చెబుతున్నారు.

కాగా జ‌న‌వ‌రిలో రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్ల‌పైకొచ్చి నిర‌స‌న‌లు తెలపడం, నాటి హెచ్ ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ - బండారు ద‌త్తాత్రేయ‌లే రోహిత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మంటూ విద్యార్థులు ఆరోపించడం తెలిసిందే. దీంతో రోహిత్ ఆత్మ‌హ‌త్య‌కు దారితీసిన కార‌ణాలు విచార‌ణ జ‌రిపి నిజనిజాల‌ను బ‌య‌ట‌పెట్టాలంటూ కేంద్రం జ‌స్టిస్ రూప‌న్‌ వాలా క‌మిటీని నియ‌మించింది. అయితే విచార‌ణ చేసిన రూప‌న్‌ వాలా రోహిత్ వేముల త‌ల్లి ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందినామె కాద‌ని, రోహిత్ వేముల కూడా ద‌ళితుడు కాదని రిపోర్ట్ స‌బ్మిట్ చేశాడు!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/