Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆ ఐఏఎస్ - ఐపీఎస్‌ లంతా మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నారా?

By:  Tupaki Desk   |   29 July 2019 2:30 PM GMT
తెలంగాణలో ఆ ఐఏఎస్ - ఐపీఎస్‌ లంతా మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నారా?
X
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ - ఎస్టీ - బీసీ వర్గాలకు చెందిన ఐఏఎస్ - ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. ఏరికోరి తమను ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమిస్తున్నారన్నది వారి అసంతృప్తికి కారణం. గత మూడేళ్ల నుండి ఈ పరిస్థితి ఉందన్న ఆరోపణలు వారి నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఇలా అసంతృప్తితో ఉన్న సీనియర్ అధికారులంతా మూకుమ్మడిగా వీఆరెస్‌ కు దరఖాస్తు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఎస్సీ వర్గానికి చెందిన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్-జనరల్ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. 2019 ఆగస్టు 31 వరకు ప్రస్తుతం ఉన్న పదవిలో కొనసాగుతానని - అదే రోజు నుండి తనను పదవీ బాధ్యతల నుండి తప్పిస్తూ వీఆర్‌ ఎస్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషికి లేఖ రాశారు. మురళి దారిలోనే మరికొందరు ఎస్సీ - ఎస్టీ - బీసీ సివిల్స్ అధికారులు వెళ్తారని తెలుస్తోంది.

మురళితో పాటు మరో 20 మంది అధికారులు ఏడాది క్రితమే హైదరాబాద్‌ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ‘బడుగు’ వర్గాలకు చెందిన ఉన్నతాధికారులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అంశంపై చర్చించారు. 2018 జూన్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఎస్సీ - ఎస్టీ - బీసిలకు చెందిన సివిల్స్ అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమిస్తుండటం పట్ల ప్రభుత్వానికి తమ అసంతృప్తి తెలియచేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏడాది క్రితమే కలిసి ఆవేదన తెలిపిన తర్వాత మార్పు వస్తుందేమోనని ఎదురు చూశారు. కాని ఎలాంటి మార్పు రాలేదని వారు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి కే. ప్రదీప్ చంద్ర రిటైర్ అయ్యారు. రిటైర్‌ మెంట్‌ కు ముందే తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం లభిస్తుందని ఆశించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో ఐఏఎస్ అధికారులు శర్మన్ - బాల మాయాదేవి - చంపాలాల్ - కిషన్ - భరత్ నాయక్ - లక్ష్మి తదితర బడుగు వర్గాలకు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది. సీనియర్ అధికారులతో పాటు జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో రిటైర్‌ మెంట్‌ కు దగ్గరగా ఉన్న అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఐఏఎస్ అధికారులే కాకుండా ఐపీఎస్ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. అనురాగ్ శర్మ డీజీపీ పోస్టు నుండి రిటైర్‌మెంట్ తర్వాత ఈ పోస్టులో కృష్ణప్రసాద్‌ ను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎస్సీ - ఎస్టీ సివిల్స్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరగడంతో ఎస్సీ వర్గానికి చెందిన కృష్ణప్రసాద్‌ ను డీజీపీగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కృష్ణప్రసాద్‌ కు డీజీపీ హోదా ఇచ్చినప్పటికీ, ఆయనను రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. కృష్ణప్రసాద్‌ ను అంతకు ముందు కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోనే కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ - ఎస్టీ - బీసీ సామాజికవర్గ అధికారుల్లో ఇది పెద్ద చర్చగా మారింది.. వారు వీఆరెస్ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.