Begin typing your search above and press return to search.

అంగ‌రంగ వైభ‌వంగా ఐఏఎస్ కుమార్తె పెళ్లి.. ఇంత డ‌బ్బు ఎక్కడిది? రేవంత్ డిమాండ్‌

By:  Tupaki Desk   |   28 Jan 2022 7:04 AM GMT
అంగ‌రంగ వైభ‌వంగా ఐఏఎస్ కుమార్తె పెళ్లి.. ఇంత డ‌బ్బు ఎక్కడిది?  రేవంత్ డిమాండ్‌
X
సాధార‌ణంగా సామాన్యుల ఇళ్ల‌లో పెళ్లిళ్లు అంటే ఒక ర‌కంగా జ‌రుగుతుంటాయి. పారిశ్రామిక వేత్తల ఇళ్ల‌లో పెళ్లిళ్లు అంటే.. వారి ఆర్థిక స్థితికి, ద‌ర్పానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయి. మ‌రి ఒక అధికారి ఇంట్లో జ‌రిగే వివాహం అంటే.. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ఎక్కువ‌గా.. పారిశ్రామిక‌,రాజ‌కీయ వ‌ర్గాల‌కు త‌క్కువ‌గా ఉంటుంది. ఎంతైనా ఐఏఎస్ అధికారులు కాబ‌ట్టి.. ఆదాయం బాగానేఉన్నా.. దానికి ప‌రిమితులు ఉంటాయి క‌నుక‌.. భారీ ఎత్తున అయితే.. కార్య‌క్ర‌మాలు ఉండ‌వు. కానీ.. తాజాగా తెలంగాణ‌లోని ఐఏఎస్ అధికారి ఇంట్లో జ‌రిగిన వివాహం మాత్రం క‌ళ్లు చెదిరేలా జ‌రిగింది.

ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేసి.. అన్న‌ట్టుగా..ఈ ఐఏఎస్ కుమార్తె పెళ్లి చేశారు. మ‌రి ఆయ‌న స‌ర్వీసు ఎంత‌.. ఆర్థికంగా ఆయ‌న కుటుంబానికి ఉన్న ద‌న్ను ఎంత‌? అని లెక్క‌లు చూసుకుంటే.. ఆయ‌న ఆస్తుల‌కు, ఆదాయానికి ఏమాత్రం పొంతన లేని విధంగా ఈ వివాహం దుమ్మురేగిపోవ‌డం..ఇప్పుడు రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఆ ఐఏఎస్ అధికారికి ఇంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు తావిచ్చింది. ప్ర‌స్తుతం ఈ వివాదం రాజ‌కీయంగా అధికార పార్టీని కార్న‌ర్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కుమార్తె వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే.. ఇంత భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి వివాహం జ‌రిపించ‌డం వెనుక‌.. నిధులు స‌మ‌కూర్చిన వారు వేరే ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా .. స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ``వివాహానికి డబ్బు ఎవరు ఖర్చు చేశారు`` అని నిల‌దీశారు. ఈ ఫైవ్ స్టార్ వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారు? ఇది క్విడ్ ప్రొ క్వో కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓ మీడియా హౌస్ సంపాదించిన ఆధారాలను బట్టి `షెల్ కంపెనీ` ద్వారా ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చులను భరించారని ఆరోపించారు.

ఈ విషయమై తెలంగాణ నీటి వనరుల శాఖ విచారణ చేపడుతుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి కూతురి పెళ్లి విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ కూడా స్పందించారు. ‘వందలాది మంది అతిథులు, నగరంలోని టాప్ హోటళ్లలో పార్టీలు, తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు, ఘనంగా ఐదు రోజులపాటు ఐఏఎస్ రజత్ కుమార్ కుమార్తె పెళ్లి చేశారు.

ఈ విషయంలో సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. గతంలోనూ టీఆర్ఎస్, బ్యూరోక్రట్ల మధ్య క్విడ్ ప్రొ క్వో జరిగింది. ఒక వేళ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. మేమే ఈ వ్యవహారాన్ని బయటపెడతాం’ అని మధుయాష్కీ ట్వీట్ చేశారు. మ‌రి ఈ వివాదంపై అధికార పార్టీ స్పందిస్తుందో లేదో చూడాలి.