Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఏడుగంట‌ల ప్ర‌సంగానికి ఐఏఎస్‌ లు ఫిదా

By:  Tupaki Desk   |   10 Dec 2017 6:30 AM GMT
కేసీఆర్ ఏడుగంట‌ల ప్ర‌సంగానికి ఐఏఎస్‌ లు ఫిదా
X
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు ఇష్ట‌మైనది ఏంటి? ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తే..వారు చెప్పే మాట‌...ఒక‌టి తెలంగాణ అయితే రెండోది మాట్లాడ‌టం. ఔను నిజమే! మాట్లాడ‌టం కేసీఆర్‌ కు చాలా ఇష్ట‌మైన విష‌యం. అది బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడ‌టం కావ‌చ్చు...త‌న ఎదురుగా ఉన్న‌వారితో కులాసాగా క‌బుర్లు చెప్ప‌డం కావ‌చ్చు. కేసీఆర్ మాట్లాడ‌టం మొద‌లుపెడితే...ఆయ‌న అనుకున్న‌పుడు మాత్ర‌మే దాన్ని ఆపేయ‌గ‌ల‌రు! అలా అని బోర్ కొట్టిస్తారా అంటే అదేం ఉండ‌దంటారు. అలాంటి కేసీఆర్‌ కు...ఆయ‌న‌కు న‌చ్చిన అంశంపై మాట్లాడే అవ‌కాశం దొరికితే...పైగా త‌ను చెప్పింది తూచా త‌ప్ప‌కుండా వినాల్సిన ప‌రిస్థితి ఉంటే...ఇంకేముంది..కేసీఆర్ విజృంభించేస్తారు క‌దా? అచ్చంగా అదే జ‌రిగింది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది కాళేశ్వ‌రం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వ‌ద్ద‌కు నేరుగా వెళ్లి వ‌చ్చిన కేసీఆర్ త‌ను గ‌మ‌నించిన విష‌యాల‌ను..చేయాల్సిన మార్పుల‌ను...తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను అధికారుల‌కు వివ‌రించారు. సుమారు ఏడు గంట‌ల‌పాటు సినిమా చూపించార‌ట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మంత్రులు - ప్రజాప్రతినిధులు - ఇంజినీరింగ్ అధికారులతో పాటు పెద్దపల్లి - సిరిసిల్ల - జయశంకర్ - భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఎలాంటి కాగితం లేకుండా నోటికి చెప్పారు. ఎలాంటి ఫైల్ ముందుంచుకోకుండా విడమర్చి చెప్తున్న తీరు ఐఏఎస్ అధికారులను అమితంగా ఆకట్టుకుంది. తుపాకులగూడెం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 20 ప్రాజెక్టుల పంపులు - నీటి సామర్థ్యం - భూ విస్తీర్ణం - సాంకేతిక అంశాలను ధారాళంగా వివరించడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సమావేశం అనంతరం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఏ మురళీ మాట్లాడుతూ.. `32 ఏళ్ల‌ నా ప్రభుత్వ సర్వీస్‌ లో ఎందరో ముఖ్యమంత్రుల వద్ద పనిచేశాను.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎన్నో జాతీయ స్థాయి సమీక్షా సమావేశాలలో పాల్గొన్నాను. కానీ క్షేత్రస్థాయి అంశాలకు సంబంధించి ఇంత పరిపూర్ణమైన.. పూర్తిస్థాయి అవగాహనతో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా చెప్పిన మంత్రులను - ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు` అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ లకు సైతం సలహాలివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం కేసీఆర్ గొప్ప పరిపాలకుడు.. ఆయనకున్న జ్ఞానం అమోఘం.. ముఖ్యమంత్రి ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందడం ఖాయమంటూ జిల్లా కలెక్టర్లు ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.