Begin typing your search above and press return to search.

బీజేపీ నేత‌ల‌తో క‌లిసి పాత్రికేయుడిపై ఐఏఎస్ ఆఫీస‌ర్ దాడి!

By:  Tupaki Desk   |   11 July 2021 6:30 AM GMT
బీజేపీ నేత‌ల‌తో క‌లిసి పాత్రికేయుడిపై ఐఏఎస్ ఆఫీస‌ర్ దాడి!
X
పత్రికా స్వేచ్ఛను అణచివేస్తున్న దేశాల్లో భారత్ ముందు వరసలోనే ఉంద‌ని, ఇక్క‌డ మీడియాకు స‌రైన‌ స్వాతంత్రం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య ‘రిపోర్ట‌ర్స్ వితౌట్ బోర్డ‌ర్స్’ అనే సంస్థ ‘గ్యాలరీ ఆఫ్ గ్రిమ్ పొర్ట్రెయిట్‌’ పేరుతో ఒక జాబితాను విడుద‌ల చేసింది. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత విడుద‌ల చేసిన ఈ జాబితాలో భార‌త్‌ కూడా ఉంది. తాజాగా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ ఐఏఎస్ అధికారే.. టీవీ రిపోర్ట‌ర్ ను వెంట‌ప‌డి మరీ బాద‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మియాగంజ్ లో శ‌నివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉన్నావ్ చీఫ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫీస‌ర్ గా ఉన్న దివ్యాన్షు ప‌టేల్‌.. రిపోర్ట్ పై దాడికి దిగాడు. ప‌రిగెత్తించి మ‌రీ కొట్టాడు. ఈ స‌మ‌యంలో దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా అత‌నిపై దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ఓటింగ్ పాల్గ‌న‌కుండా లోక‌ల్ కౌన్సిల్ స‌భ్యుల‌ను కొంద‌రు కిడ్నాప్ చేశార‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఈ విష‌యంలో ఐఏఎస్ ఆఫీస‌ర్ దివ్యాన్షు ప్రమేయం కూడా ఉందనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసినందుకే త‌న‌పై దివ్యాన్షు, బీజేపీ నేత‌లు దాడిచేశార‌ని బాధిత రిపోర్ట్ కృష్ణ తివారీ ఆరోపించాడు.

అయితే.. ఈ దాడి ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నిస్తే.. దివ్యాన్షు స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. దీనిపై ఉన్నావ్ క‌లెక్ట‌ర్ స్పందించారు. బాధితుడి నుంచి వాంగ్మూలం సేకరించామ‌ని, ద‌ర్యాప్తు పార‌ద‌ర్శ‌కంగా చేప‌డ‌తామ‌ని చెప్పారు. కాగా.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో నిత్య కృత్యంగా మారాయని, జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు పెరిగిపోతున్నాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.