Begin typing your search above and press return to search.

మోదీ ‘జనతా కర్ఫ్యూ’ ఐడియా మనోడిదేనా?

By:  Tupaki Desk   |   23 March 2020 4:55 AM GMT
మోదీ ‘జనతా కర్ఫ్యూ’ ఐడియా మనోడిదేనా?
X
ప్రాణాంతక వైరస్ కోవిడ్- 19ను నిలువరించేందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నాడు దేశమంతా ‘జనతా కర్ఫ్యూ’ పేరిట స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. దేశంలో ఎన్నిసార్లు బంద్ లు జరిగినా... ఈ తరహాలో రోడ్లన్నీ నిర్మానుష్యం కాలేదంటే అతిశయోక్తి కాదేమో. కరోనాపై భయంతో పాటు స్వయంగా ప్రధాని ఇచ్చిన పిలుపుతో జనం నిజంగానే ఆదివారమంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూను గ్రాండ్ సక్సెస్ చేశారు. సరే... జనతా కర్ఫ్యూ అయితే గ్రాండ్ సక్సెస్ అయ్యింది గానీ.. మరి ఈ గ్రాండ్ సక్సెస్ ఫార్మ్యూలాను ప్రధాని మోదీకి ఇచ్చింది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అదిరేటి ఐడియాను మోదీకి ఇచ్చింది మన తెలుగు నేలతో గాఢానుబంధం ఉన్న ఓ ఐఏఎస్ అధికారేనట. ఆయన మరెవరో కాదు... ఉమ్మడి ఏపీలో కలెక్టర్ గా ఉండి కూడా కేంద్రం నుంచి అవార్డులు, రివార్డులు అందుకున్న యువ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ అంట.

నిజమా? అంటే.. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం వినిపిస్తున్న విశ్లేషణలను బట్టి చూస్తే... ఆ తరహా ఐడియాలను రచించడంలోనే కాకుండా అమలు చేసి ఫలితాలను రాబట్టడంలో అగర్వాల్ కు ఉన్న ట్రాక్ రికార్డు చూస్తే.. నిజమేనని చెప్పక తప్పదు. 1996 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారి అయిన అగర్వాల్ రాష్ట్ర విభజన తరువాత ఏపీ కేడర్ కే వచ్చారు. ఆ తర్వాత సెంట్రల్ సర్వీసులకు వెళ్లిన లవ్... ప్రస్తుతం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో కొల్లేరు సరస్సు ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టిన అగర్వాల్ అందులో సక్సెస్ సాధించి ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు. పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా జిల్లాకూ సంబంధం ఉన్న కొల్లేరు సరస్సు ఆక్రమణలను తొలగించే విషయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ తో కలిసి లవ్ తాను అనుకున్న పనిని దిగ్విజయంగా ముగించారు.

సరే... తాజాగా జనతా కర్ఫ్యూ మంత్రాంగంలో అగర్వాల్ కీలకంగా వ్యవహరించిన విషయానికి వస్తే... ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నియంత్రించడంలో వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలకంగా మారాయి. ఆ శాఖ అధికారులు ఇస్తోన్న ఆలోచనలను మరింత పదును పెడుతూ కేంద్ర ప్రభుత్వం కార్యాచరణలోకి తీసుకొస్తోంది. కరనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకడాన్ని నియంత్రించగలిగితే.. దాని వ్యాప్తిని అడ్డుకోవచ్చని, దీనికోసం దేశ ప్రజలందరూ సహకరించాల్సి ఉంటుందని, ఏకతాటిపై నడవాల్సి ఉంటుందనే ఆలోచనను లవ్ అగర్వాల్... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూచించారట. మరి ఈ కర్ఫ్యూను జనం పాటిస్తారా? అన్న ప్రశ్న మోదీకి రాగానే... జనంలో మోదీ పట్ల ఉన్న కమిట్ మెంట్, కరోనా పట్ల ఉన్న భయం జనాన్ని జనతా కర్ఫ్యూ బాట పట్టిస్తాయని అగర్వాల్ తనదైన వాదనను వినిపించారట. అగర్వాల్ వాదన మెచ్చిన మోదీ... దానిపై మరింతగా కసరత్తు చేసి జనతా కర్ఫ్యూ ను ప్రకటించారట. మొత్తంగా జనతా కర్ఫ్యూ... మన మనసులను గెలచుకున్న మన తెలుగు ఐఏఎస్ బుర్ర నుంచి వచ్చిందన్న విషయం నిజంగానే మనందరికీ గర్వ కారణమే కదా.