Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో ఆంక్షలపై ఐఏఎస్ వినూత్న నిరసన..!

By:  Tupaki Desk   |   26 Aug 2019 4:45 AM GMT
కశ్మీర్ లో ఆంక్షలపై ఐఏఎస్ వినూత్న నిరసన..!
X
కశ్మీర్ కు సంబంధించి ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చింది లేదు. కాకుంటే.. వారాలకు తరబడి.. కశ్మీర్ వ్యాలీని ఆంక్షలు విధించటంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో కీలక నిర్ణయాన్ని వ్యతిరేకించనప్పటికీ.. అక్కడి ప్రజల్ని ఆంక్షల్లో మగ్గిపోయేలా చేయటాన్ని పలువురు తప్ప పడుతున్నారు.

ఇందులో భాగంగా ఒక యువ ఐఏఎస్ తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. కశ్మీర్ లోని ప్రజలపై ఆంక్షలు విధిస్తూ వారాల తరబడి వారిని బయటకు రాకుండా చేస్తున్న ప్రభుత్వ తీరును తప్పు పట్టారు ఐఏఎస్ కన్నన్ గోపీనాథన్. గడిచిన 20 రోజులుగా కశ్మీరీలపై తీవ్రమైన ఆంక్షలు విధించటాన్ని ఆయన తప్పు పట్టారు.

భద్రత పేరుతో ఆంక్షలు విధించటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గోపీనాథన్ కేరళకు చెందిన వారు. 33 ఏళ్ల వయసున్న ఈ యువ ఐఏఎస్ ప్రస్తుతం కేరళకు చెందిన 33 ఏళ్ల కన్నన్ గోపీనాథన్ ప్రస్తుతం దాద్రానగర్ హవేలీలో విద్యుత్ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఏడేళ్లుగా సర్వీసులో ఉన్న ఆయన ట్రాక్ రికార్డు చూస్తే.. ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి. తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పోషిస్తూ.. తనదైన ముద్రను వేశారన్న పేరుంది.

మిజోరంలో కలెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడ జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తో శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయించటం.. నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థను లాభాల బాట పట్టించటం లాంటివి ఆయన చేసిన పనుల్లో కొన్నిగా చెప్పొచ్చు. తన రాజీనామాతోనే కశ్మీర్ లో పరిస్థితి మారిపోతుందన్న ఆశ లేదని.. కాకుంటే తాను తీసుకున్న నిర్ణయం.. ఆలోచించేలా చేస్తుందన్న ఆశావాహాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనకేమాత్రం సంబంధం లేని విషయం మీద ఒక యువ ఐఏఎస్ తీసుకున్న తీవ్రమైన నిర్ణయం.. ఆయన కోరుకున్నట్లు కాస్తంతైనా ప్రభావం చూపిస్తే బాగుంటుంది.