Begin typing your search above and press return to search.

యడ్డికి కోపం తెప్పించిన తెలుగు లేడీ సింగం

By:  Tupaki Desk   |   25 Sep 2019 10:08 AM GMT
యడ్డికి కోపం తెప్పించిన తెలుగు లేడీ సింగం
X
దేశంలో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ.. కొందరు మాత్రం సో.. స్పెషల్ అన్నట్లుగా ఉంటారు. కమిట్ మెంట్ తో పని చేయటం.. ఎంతటి ఒత్తిడికైనా తలొగ్గక.. రూల్ ప్రకారం పని చేసే అధికారులు చాలా కొద్దిమంది ఉంటారు. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉంటే అలాంటి అధికారుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి దాసరి సింధూరిపై తాజాగా వేటు పడింది.

లేడీ సింగంగా పేరున్న ఆమెకు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా వెనక్కి తగ్గేందుకు ఇష్టపడరు. ఒత్తిడితో ఆమె చేత పని చేయించటం సాధ్యం కాదంటారు. ఈ కారణంతోనే రాష్ట్ర సీఎంగా ఎవరున్నా సరే.. రూల్ బుక్ ప్రకారం పని చేయటం ఆమెకు అలవాటు. ఈ తీరుతోనే ఆమెపైన అదే పనిగా బదిలీ వేటు పడుతూ ఉంటుంది.

తాజాగా యడ్డి సర్కారుకు కూడా ఆమె పైన కోపం వచ్చేసింది. మరేం ఆలోచించకుండా ఆమెపైన బదిలీ వేటు వేసేశారు. హైదరాబాద్ కు చెందిన తెలుగమ్మాయి దాసరి సింధూరి. సివిల్స్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా టాప్ 50లో ఒకరుగా నిలిచిన ఆమె ముక్కుసూటిగా పని చేస్తుంటారు. రాజకీయ ఒత్తిళ్లకు ససేమిరా అనేయటం ఆమెకు అలవాటే. అదే ఆమెను తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఆమె భవన నిర్మాణ సంక్షేమ సంఘం శాఖకు అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక వరదల నేపథ్యంలో యడ్యూరప్ప సర్కారు ఆమె శాఖ వద్ద ఉన్న నిధుల్లో వెయ్యి కోట్ల రూపాయిల్ని విపత్తు సహాయ నిధికి మళ్లించాలని కోరారు. దీనికి సింధూరి ససేమిరా అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ఆదేశించిన తర్వాత కూడా తాను చెప్పిన పని జరగకపోవటాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. అంతే.. తనకున్న పవర్స్ తో ఆమెపై బదిలీ వేటు వేశారు.

తన కెరీర్ లో ఇప్పటికే మూడుసార్లు బదిలీ వేటు వేయించుకున్న సింధూరి నాలుగోసారి బదిలీ వేటు పడిపోయింది. ఆమెను ప్రస్తుతం పట్టు పరిశ్రమ శాఖకు బదిలీ చేస్తూ యడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలానే ఈ బదిలీ విషయాన్ని లైట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. లేడీ సింగం అన్నాక రూల్స్ బ్రేక్ చేసినోళ్లకు చుక్కలు చూపించకుండా ఉంటుందా ఏంటి?