Begin typing your search above and press return to search.

జగన్ నవరత్నాలు..అమలు బాధ్యత శ్రీలక్ష్మీదేనా?

By:  Tupaki Desk   |   30 May 2019 4:12 AM GMT
జగన్ నవరత్నాలు..అమలు బాధ్యత శ్రీలక్ష్మీదేనా?
X
22 ఏళ్లకే దేశంలోనే అత్యున్నత సర్వీసు అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)కు ఎంపికైన శ్రీలక్ష్మీ... పాలనలో సమర్థవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడున్నా... తనదైన పనితీరుతో ముందుకు సాగిన శ్రీలక్ష్మీ... ఏ శాఖ అయినా తనకు కొట్టిన పిండేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కీలక శాఖ అయిన గనుల శాఖ కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. అక్కడ కూడా తనదైన పనితీరు కనబరచిన శ్రీలక్ష్మీ... సర్కారుకు గనుల శాఖ నుంచి భారీ ఆదాయాన్ని రాబట్టారు.

అయితే అనుకోని కారణాల వల్ల నాటి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు సర్కారు తప్పుబట్టింది. ఫలితంగా కేబినెట్ తీఃసుకున్న నిర్ణయాల కారణంగా ఆమె జైలు పాలయ్యారు. చాలాకాలం పాటు జైల్లోనే ఉన్న ఆమె తీవ్ర మానసిక వేదనతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నడుస్తూ జైల్లోకి వెళ్లిన శ్రీలక్ష్మీ... వీల్ చైర్ లో బయటకు వచ్చిన దృశ్యం అందరినీ కలచివేసింది. అయితే న్యాయస్థానాల్లో తనదైన పోరు సాగించిన శ్రీలక్ష్మీ... చివరకు నిర్దోషిగా బయటకు వచ్చారు. అప్పటికే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోతే... ఏపీకే చెందినప్పటికీ... తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. తాజాగా ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఏపీలో అధికారం చేపట్టనుంది. ఈ క్రమంలో తన పనితీరుకు తగిన పోస్టు దక్కుతుందన్న ఆశాభావంతో ఏపీ కేడర్ కు బదిలీ చేయాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్నారు.

ఆమె వినతికి సానుకూలంగా పరిశీలించిన జగన్ ఓకే చెబితే... ఏపీకి ఆమెను పంపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సరేనన్నారు. మొత్తంగా ఇప్పుడు ఆమె ఏపీకి రావడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ క్రమంలోనే ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. జగన్ కు భారీ గెలుపు దక్కడం వెనుక ఆయన ప్రకటించిన నవరత్నాలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నవరత్నాల అమలు కోసం ఏకంగా ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ శాఖ బాధ్యతలను శ్రీలక్ష్మీకి అప్పజెప్పనున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... వైఎస్ హయాంలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్రీలక్ష్మీ జగన్ హయాంలో మరింత కీలక బాధ్యతల్లోకి చేరిపోయిన్టటే.