Begin typing your search above and press return to search.

మోడీకి మానవబాంబు ముప్పు

By:  Tupaki Desk   |   25 July 2015 5:24 AM GMT
మోడీకి మానవబాంబు ముప్పు
X
మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా.. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మాత్రం ప్రధాని మోడీ యమా యాక్టివ్ అయిపోతారు. ఆ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెడుతుంటారు. పదే పదే పర్యటిస్తుంటారు. ఆయన అనుకున్నది సాధించే వరకూ దాన్ని విడిచిపెట్టరు.

జమ్మూకాశ్మీర్ లో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంలో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా.. జమ్మూకశ్మీర్ కు వెళ్లటం తెలిసిందే. ఆయన అంతగా ప్రయత్నించినా.. జమ్మూకాశ్మీర్ లో పీడీపీతో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయక తప్పింది కాదు. కానీ.. ఒక్కసారి అక్కడ సర్కారు ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆయన ప్రాధాన్యత జాబితాలో కాశ్మీర్ మిస్ అయ్యింది.

అలా ఎన్నికలు జరిగే రాష్ట్రాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించటం మోడీకి మామూలే. తాజాగా బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మోడీ దృష్టి సారించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా బీహార్ లో కమలనాథులు కొలువు తీరాలన్న పట్టుదలతో మోడీ ఉన్నారు. ఇందుకోసం రానున్న రోజుల్లో మరింత సమయం కేటాయించనున్నారు.

అయితే.. బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీపై దాడి జరగొచ్చన్న హెచ్చరికను ఐబీ జారీ చేసిందని చెబుతున్నారు. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఏ రీతిలో అయితే మానవబాంబు దాడి జరిగిందో అదే తీరులో మోడీపై దాడి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో శనివారం పాట్నాలో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

మోడీకి మానవబాంబు ముప్పు ఉన్న నేపథ్యంలో.. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మానవబాంబు దాడి ఎలా జరుగుతుందన్న అంశంపై ఐబీ ఇప్పటికే కొన్ని అంచనాలు వేసింది. మీడియా వ్యక్తిగా కానీ.. పోలీసు అధికారిగా.. ఎలక్ట్రిషియన్.. కార్మికుడి వేషంలో మానవబాంబు దాడి జరిగే వీలుందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్నికల వేళ.. ఉత్సాహంగా దూసుకెళ్లకుండా.. మోడీ కాస్తంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.