Begin typing your search above and press return to search.

ఇబ్ర‌హీంపూర్.. ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్‌

By:  Tupaki Desk   |   11 April 2017 6:20 AM GMT
ఇబ్ర‌హీంపూర్.. ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్‌
X
ఇబ్ర‌హీంపూర్‌. ఈ ఊరు గురించి తెలుసా? అంటే.. క్వ‌శ్చ‌న్ మార్క్ ఫేస్ పెట్ట‌టం ఖాయం. ఏ మాత్రం ప్ర‌చారంలో లేని ఈ ఊరి గురించి ఎందుకంత స్పెష‌ల్ గా అడుగుతున్నార‌న్న ప్ర‌శ్న ట‌పీమ‌ని రావ‌టం ఖాయం. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఒక చిన్న గ్రామానికి ఉన్న ప్ర‌త్యేక‌త‌ల గురించి చెబుతుంటే అవాక్క‌వ్వాల్సిందే. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి కాబ‌ట్టే.. ప్ర‌తిష్ఠాత్మ‌క రాష్ట్రీయ గౌర‌వ్ గ్రామీణ స‌భ అవార్డును ఇబ్ర‌హీంపూర్ సొంతం చేసుకుంద‌ని చెప్పాలి. ఈ నెల 24న ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీక‌రించ‌నున్నారు. జాతీయ పంచాయితీరాజ్ దినోత్స‌వం నాడు.. ల‌క్నోలో జ‌రిగే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఈ పుర‌స్కారాన్ని ఇబ్ర‌హీంపూర్ సొంతం చేసుకోనుంది.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామానికి ఇంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం ల‌భించ‌టం ప‌ట్ల తెలంగాణ రాష్ట్ర ఇరిగేష‌న్ మంత్రి హ‌రీశ్ రావు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తాను మ‌న‌స్ఫూర్తిగా గ్రామ‌స్తుల్ని అభినందిస్తున్నట్లుగా హ‌రీశ్ వెల్ల‌డించారు. ఇంత‌కీ ఈ ఊరికి ఉన్న విశిష్ట‌త ఏమిటి? అంత‌టి అవార్డును ఎలా సాధించింది? ఇంత పెద్ద దేశంలో వేలాది గ్రామాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఏ ఊరికి లేనంత ప్ర‌త్యేక‌త తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మండ‌లంలోని ఇబ్ర‌హీంపూర్ లో ఏముంద‌న్న విష‌యానికి వెళితే..

దేశంలోనే మొట్ట‌మొద‌టి క్యాష్ లెస్ గ్రామంగా ఇబ్ర‌హీంపూర్‌ను చెప్పొచ్చు. గ‌త న‌వంబ‌రులో దేశ ప్ర‌ధాని పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన కొద్దిరోజుల‌కే.. గ్రామం యావ‌త్తు క్యాష్ లెస్ గ్రామంగా అవ‌త‌రించింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి అకౌంట్లు తెరిపించి.. వారికి డెబిట్ కార్డులు పంపిణీ చేయ‌ట‌మే కాదు.. గ్రామంలో నిర్వ‌హించే అన్ని ఆర్థిక లావాదేవీల్ని డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించ‌టం ఒక ఘ‌న‌త‌గా చెప్పాలి. గ్రామంలోని కిరాణా షాపులు సైతం న‌గ‌దుర‌హిత చెల్లింపుల్ని చేప‌ట్ట‌టం విశేషం.

స్వైపింగ్ కార్డు మెషీన్లు అన్ని కిరాణ‌తో స‌హా మిగిలిన దుకాణాల్లోనూ అందుబాటులోకి వ‌చ్చాయి. అంతేనా.. రేష‌న్ షాపుల్లో ఏటీఎంల‌ను ఏర్పాటుతో పాటు.. ఈ ఊరులో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేయ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి. అంతేకాదు.. దోమ‌ల‌న్న‌వి ఈ పంచాయితీ ప‌రిధిలో భూత‌ద్దం వేసి వెతికినా క‌నిపించ‌వ‌ని చెబుతున్నారు. ఇన్ని గొప్ప అంశాలుఉండ‌టం వ‌ల్ల‌నే.. ఈ గ్రామం అంత పెద్ద పుర‌స్కారానికి అర్హ‌త సాధించింద‌ని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/