Begin typing your search above and press return to search.

ఐసీసీ సరికొత్త అవార్డు....రేసులో నిలిచిన నలుగురు టీమిండియా ఆటగాళ్లు !

By:  Tupaki Desk   |   27 Jan 2021 1:30 PM GMT
ఐసీసీ సరికొత్త అవార్డు....రేసులో నిలిచిన నలుగురు టీమిండియా ఆటగాళ్లు !
X
ఐసీసీ నేడు సరికొత్త అవార్డును ప్రవేశపెట్టింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ఈ సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రతి నెలా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ఓటింగ్‌ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. ఓట్ల ఆధారంగా పురుష, మహిళా క్రికెటర్లకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఏడాది పొడవునా అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనకారులకు ఐసీసీ ఈ అవార్డులు ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ మాజీ ఆటగాళ్ళు, ప్రసారకులు, జర్నలిస్టులతో కూడిన స్వతంత్ర ఓటింగ్ అకాడమీ.. అభిమానులతో కలిసి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం ఓటు వేసి నిర్ణయిస్తారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సంవత్సరమంతా అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనలను పండుగలా జరుపుకునే గొప్ప మార్గంగా భావిస్తున్నాం అని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్ అన్నారు.

మూడు ఫార్మాట్లలోనిప్రతి క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో సాధించిన విజయాల ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్ ‌లో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు.

అయితే ఈ సరికొత్త అవార్డు కేటగిరీలో జనవరి నెలకుగానూ భారత్‌ నుంచి నలుగురు క్రికెటర్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు.. రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, టి.నటరాజన్‌తో పాటు రవిచంద్ర అశ్విన్‌ పేర్లను పరిశీలిస్తోంది.