Begin typing your search above and press return to search.

పెళ్లి ప‌రిటాల‌కి.. పాట్లు వారికి!

By:  Tupaki Desk   |   1 Oct 2017 11:52 AM GMT
పెళ్లి ప‌రిటాల‌కి.. పాట్లు వారికి!
X
సాధార‌ణంగా ఎవ‌రింట్లో అయినా పెళ్లి జ‌రిగితే... చుట్టాలు, బంధువులు స‌హా చుట్టుప‌క్క‌ల వాళ్లు కూడా హ్యాపీగా ఫీల‌వుతారు. అయితే, అనంత‌పురానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ కుటుంబం ప‌రిటాల ఇంట జ‌రుగుతున్న పెళ్లి మాత్రం కొంద‌రిలో మంట పుట్టిస్తోంది. ``మా కెందుకురా ఈ తిప్ప‌లు..`` అనుకునే రేంజ్‌ లో వారు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రు బాధ‌ప‌డుతున్నారు? ఎందుకు బాధ‌ప‌డుతున్నారో చూద్దాం.. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం ఆదివారం ఓ ఇంటి వాడు అవుతున్నాడు. ఏకైక కుమారుడు కావ‌డం, ప‌రిటాల ఫ్యామిలీలో తొలి వేడుక కావ‌డంతో ఈ పెళ్లిని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు సునీత‌.

ఈ పెళ్లికి రాష్ట్ర ప్ర‌భుత్వం మొత్తం త‌ర‌లి వెళ్తోంది(మంత్రి స్వ‌యంగా ఆహ్వానించారు). దీంతో మంత్రి సునీత‌కు చెందిన శాఖ‌లోని ఐసీడీఎస్ అధికారులు కూడా ఈ వేడుక‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, శ‌నివారం ద‌స‌రా కావ‌డం, ఆదివారం సెల‌వు కావ‌డంతో అనంత‌పురం స‌హా దేశ‌వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలకు సెల‌వు ప్ర‌క‌టించారు. అయితే, విచిత్రంగా ప‌రిటాల ఇంట‌ పెళ్లికి వ‌స్తున్న ఉన్న‌తాధికారులు వ‌చ్చిన ప‌ని చూసుకోకుండా.. పెళ్లి అనంత‌ర‌మో.. ముందో.. జిల్లాలోని ఐసీడీఎస్ కేంద్రాలు - అంగ‌న్‌ వాడీ కేంద్రాల ప‌నితీరును ప‌రిశీలిస్తార‌ట‌!!

దీంతో సెలవు రోజులు అయిన‌ప్ప‌టికీ.. కొన్ని అంగన్‌ వాడీ సెంటర్లను తెరిచే ఉంచాలని ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశం మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గురువారం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు మంత్రి కుమారుడి పెళ్లి వస్తే.. తాము పండుగ రోజున కూడా పనిచేయాలా..? అని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తాము పనిచేసినా సెలవు రోజుల్లో సెంటర్లకు పిల్లలను ఎలా పిలుచుకురావాలని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక‌, దీనిపై వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న‌తాధికారులు ప‌రిశీలించే అవ‌కాశం ఉండ‌డంతోనే తాము సెల‌వు రోజుల్లోనూ ప‌నిచేయాల‌ని చెప్పామ‌ని క్లారిటీ ఇచ్చారు. సో.. ఇదీ బాబు మార్క్ ప్ర‌భుత్వం!! దీంతో అంగ‌న్‌ వాడీ - ఐసీడీఎస్ కేంద్రాల వారు.. ఈ పెళ్లి.. త‌మ లొల్లికి వ‌చ్చింద‌ని ఫీల‌వుతున్నారు.