Begin typing your search above and press return to search.

నీకిది..నాక‌ది...బ్యాంకు రుణాల్లో కొత్త మోసం

By:  Tupaki Desk   |   30 March 2018 5:11 AM GMT
నీకిది..నాక‌ది...బ్యాంకు రుణాల్లో కొత్త మోసం
X
అప్పులు ఇచ్చి ఎగ‌వేత‌ల వ‌ల్ల కుదేలు అయిపోతున్న బ్యాంకుల ఉదంతం ఓవైపు క‌ల‌క‌లం రేకెత్తిస్తుండ‌గా..మ‌రోవైపు తాజాగా క్విడ్‌ప్రోకో తీరు వెలుగులోకి వ‌చ్చింది. నీకు కావాల్సిన లోను ఇస్తా...మాకు కావాల్సిన ఆర్థిక మేలు చేయి అనే రీతిలో ఒప్పందం కుదిరింద‌ని అందుకు ప్ర‌తిష్టాత్మ‌క ఐసీఐసీఐ బ్యాంక్ వెలుగులోకి వ‌చ్చింద‌ని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వ‌స్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల్లో చిక్కుకుంది ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో - ఎండీ చందాకొచ్చర్. ఆమె వీడియోకాన్‌ కు రూ.3,250 కోట్ల రుణం దక్కెలా సాయం చేశారని - బ‌దులుగా ఆమె భ‌ర్త భాగ‌స్వామిగా ఉన్న కంపెనీకి వాటాల బ‌దిలీ జ‌రిగిపోయింద‌ని తేలింది.

వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్‌ తో పాటు చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ - చందాకొచ్చర్‌ కు చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు 2008లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్‌ కు రూ.3,250 కోట్ల‌ రుణాన్ని మంజూరు చేసింది. అయితే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ గ్రూపునకు ఈ రుణం అందిన వెంటనే ఆ కంపెనీలో ఉన్న వేణుగోపాల్ తన వాటాను దీపక్ కొచ్చర్‌ కు బదిలీచేశారు! ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన ఈ రుణంలో దాదాపు 86 శాతం అంటే రూ.2,810 కోట్లు ఈ గ్రూపు చెల్లించలేకపోయింది. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకుకు మాత్రమే కాక - మొత్తం బ్యాంకులన్నీ కలిసి వీడియోకాన్‌ కు రూ.36 వేల కోట్ల రుణమిచ్చినట్లు తెలుస్తోంది.

అయితే నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూపునకు కొచ్చర్ రుణమిచ్చారని, దీంతో ఆమె కుటుంబీకులు లబ్ది పొందారని ప్రస్తుతం ఆరోపణలు గుప్పుమన్నాయి. వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల రుణం దక్కెలా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో - ఎండీ చందాకొచ్చర్ సాయం చేశారని ఆరోపణలపై బ్యాంక్ స్పందించింది. 2012 ఏప్రిల్‌ లో వీడియోకాన్ గ్రూపునకు రుణాలిచ్చిన కన్సార్టియంలో తమది లీడ్ బ్యాంకు కూడా కాదని పేర్కొంది. అంతే త‌ప్ప క్విడ్‌ ప్రోకో పై స్ప‌ష్టంగా వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.