Begin typing your search above and press return to search.

రూ. వేల కోట్ల రుణం మంజూరు కేసులో మాజీ మహిళా సీఈవోకు ఊరట!

By:  Tupaki Desk   |   9 Jan 2023 9:34 AM GMT
రూ. వేల కోట్ల రుణం మంజూరు కేసులో మాజీ మహిళా సీఈవోకు ఊరట!
X
వీడియోకాన్‌ కు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసిన కేసులో అరెస్టు అయిన ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఇదే కేసులో అరెస్టు అయిన చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ ను కూడా జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

వీడియోకాన్‌ గ్రూపుకు రుణాల మంజూరు వ్యవహారంలో గత డిసెంబరు 23న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొశ్చర్‌ ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తమను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ చందా కొశ్చర్‌ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తమ కుమారుడికి వివాహం నిశ్చయమైందని తెలిపారు. ఇప్పటికే బంధువులందరికీ ఆహ్వానాలు కూడా పంపామన్నారు. ఈ నేపథ్యంలో తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. చట్టానికి అనుగుణంగా కొచ్చర్‌ దంపతుల అరెస్టు జరగలేదని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే పూచీకత్తు కింద చెరో రూ.లక్ష జమ చేయాలని చందా కొశ్చర్, ఆమె భర్త దీపక్‌ కొశ్చర్‌ ను ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ విచారణకు సహకరించాలని వారికి సూచించింది. సీబీఐ సమన్లు జారీ చేసినప్పుడు హాజరుకావాలని చందా కొశ్చర్‌ దంపతులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా దేశం విడిచి పారిపోకుండా వారి పాస్‌పోర్టులను కూడా సీబీఐకి సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

కాగా వీడియోకాన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని కంపెనీలకు 2012లో రుణాలు మంజూరు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు బ్యాంకు సీఈవో హోదాలో ఉన్న చందా కొశ్చర్‌ రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్‌ కు మంజూరు చేసింది. అయితే అది నాన్‌ ప్రాఫిట్‌ అసెట్‌ (ఎన్‌పీఏ)గా మారడంతో ఆమె కుటుంబం దీని నుంచి లబ్ధి పొందినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

వీడియోకాన్‌కు వేల కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా చందా కొశ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ నిర్వహించే న్యూపవర్‌లో వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ స్వయంగా పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో క్విడ్‌ ప్రోకో (నీకిది.. నాకది) జరిగిందని సీబీఐ ఆరోపించింది. చందా కొచ్చర్‌ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది.


ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్, న్యూపవర్‌ రెన్యూవబుల్స్, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ లపై సీబీఐ కేసు నమోదు చేసింది.