Begin typing your search above and press return to search.

కరోనా ఫోర్త్ వేవ్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:18 PM GMT
కరోనా ఫోర్త్ వేవ్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన
X
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగం చూస్తుంటే నాలుగో దశ మొదలైనట్లే అనిపిస్తోంది. చాలా మంది కరోనా ఫోర్త్ వేవ్ షురూ అయిందని ఆందోళనకు గురవుతున్నారు. కానీ దేశ ప్రజలకు ఐసీఎంఆర్ ఓ గుడ్న్యూస్ చెప్పింది. భారత్లో కొవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ(అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీపన్ పాండా స్పష్టం చేశారు.

కరోనా మరోసారి కోరలు చాస్తోంది. కంటికి కనిపించకుండా లక్షల మంది ప్రాణాలు బలి తీసుకున్న మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. భారత్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కరోనా నాలుగో దశ మొదలైందని భయపడుతున్నారు. మళ్లీ మహమ్మారి తమను.. తమ ఆత్మీయులను బలి తీసుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ తమ జీవితం గాడి తప్పుతుందేమోనని జంకుతున్నారు.

అయితే కరోనా నాలుగో దశ వ్యాప్తి పైన ఐసీఎంఆర్ ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో కొవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ సమీరన్ పాండా క్లారిటీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కేసులు పెరగడాన్ని దేశవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకోలేమని చెప్పారు. దేశంలో కనిపించే రూపాంతరం చెందిన ప్రతి వైరస్ ఆందోళన కలిగించేది కాదని స్పష్టం చేశారు.

మరోవైపు భారత్లో కొవిడ్ ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదని మాక్స్ హెల్త్‌కేర్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ టిక్కూ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నా మునుపటి లాగా ప్రమాదకరంగా మారే పరిస్ధితి లేదని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ వల్ల ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఇదిలా ఉండగా భారత్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం కరోనా నాలుగో దశ రాలేదని.. అలాగని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

మాస్కు వాడకం తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రోజు వారి కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కొత్త వేరియంట్ లక్షణాలు సోకిన వ్యక్తుల నమూనాలను పంపాలని కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలను కోరారు.