Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్ఓ వల్లే ఈ పరిస్థితి ... ఎమర్జెన్సీ పెట్టాల్సింది , గ్లోబల్ నిపుణుల ఆగ్రహం !

By:  Tupaki Desk   |   13 May 2021 5:30 AM GMT
డబ్ల్యూహెచ్ఓ వల్లే ఈ పరిస్థితి ...  ఎమర్జెన్సీ పెట్టాల్సింది , గ్లోబల్ నిపుణుల  ఆగ్రహం !
X
గత ఏడాదిన్నరకి పైగా కరోనా మహమ్మారి తన జోరు చూపిస్తూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే 33.4లక్షల మంది కరోనా కాటుకి బలైపోయారు. బుధవారం నాటికి ప్రపంచం లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 16కోట్లు దాటింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమయానుకూలంగా వ్యవహరించింటే ఈ విపత్తు ఇంతటి తీవ్రస్థాయిలో ఉండేదికాదని అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ఫైర్ అయింది. కరోనాను ఎదుర్కొనే విషయంలో డబ్ల్యూహెచ్ ఓ తొలి నుంచీ తీసుకున్న పేలవమైన నిర్ణయాల వల్లే ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ బృందం వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ అవసరమని కోవిడ్ 19 మేక్‌ ఇట్‌ ఇన్‌ ది లాస్ట్‌ పాండమిక్‌ పేరుతో రూపొందించిన నివేదిక సూచించింది.

కరోనా మహమ్మారిని అత్యవసర స్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆలస్యం చేసిందని , ప్రపంచ ఆరోగ్యసంస్థ లో సమూల సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. 2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ వెలుగులోకి రాగా, దానిపై అత్యవసరంగా స్పందించడంలో, ఇతర దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ ఓ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఫిబ్రవరి 2020నాటికి గానూ ఎమర్జెన్సీ ప్రకటించడంతో వైరస్ కట్టడికి విలువైన కాలాన్ని ప్రపంచదేశాలు కోల్పోయాయని ది ఇండిపెండెంట్‌ ప్యానెల్‌ ఫర్‌ పాండమిక్‌ ప్రిపేర్డ్‌ నెస్‌ అండ్‌ రెస్పాన్స్‌ తన నివేదికలో పొందుపరిచింది. ప్రజలను రక్షించుకోవడంలో వ్యవస్థలు విఫలమవడంతో పాటు సైన్స్‌ ను తిరస్కరించే నాయకులు ఆరోగ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అని ఐపీపీపీఆర్‌ తన నివేదికలో అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే మాత్రం ధనిక దేశాలు వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పేద దేశాలకు అందించాలని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఓ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చింది. ఇంతటి విపత్కర సందర్భంలో డబ్ల్యూహెచ్‌ ఓ నాయకత్వంతో పాటు సిబ్బంది చేస్తున్న కృషిని నిపుణుల బృందం ప్రశంసించింది.