Begin typing your search above and press return to search.

ఐసీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:36 AM GMT
ఐసీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్.. ఎందుకిలా?
X
ముంచుకొస్తుందని ఎప్పటి నుంచో అంచనా వేస్తున్న థర్డ్ వేవ్.. అనుకున్నట్లే వచ్చేయటం.. రావటంతోనే తన ఆరాచకం మొదలుపెట్టటం తెలిసిందే. చూస్తుండగానే.. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. మూడో వేవ్ కు కాస్త ముందుగా.. ఎవరెంత తిరిగినా.. ఇష్టారాజ్యంగా వ్యవహరించినా కనిపించని కరోనా కేసులు.. ఇప్పుడు మాత్రం అదే పనిగా తెర మీదకు వస్తున్నాయి. సామాన్యుల సంగతిని పక్కన పెట్టేద్దాం. చివరకు సెలబ్రిటీలు సైతం రోజు గడిచేసరికి పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు.

మూడో వేవ్ ముందు వరకు ఇష్టా రాజ్యంగా తిరిగినా అంటుకోని కరోనా మహమ్మారి.. ఇప్పుడు మాత్రం ఇట్టే తగిలేయటం చూస్తున్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ప్రముఖులు అన్న వారంతా కరోనా బారిన పడుతున్నారు. కాకుంటే కాస్త ముందు.. మరికాస్త వెనకాలే తేడా. చూస్తుండగానే యాభై వేలు.. ఆ వెంటనే లక్ష.. ఇప్పుడు లక్షన్నర కేసుల్ని రోజువారీగా టచ్ చేస్తున్న వైనం చూస్తే.. కేసులు గరిష్ఠస్థాయికి చేరుకోవటం ఒక ఎత్తు అయితే.. ఈ నమోదు ఏ స్థాయి వరకు వెళ్లి ఆగుతుందన్నది అర్థం చేసుకోలేకపోతున్నారు.

అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశంలో రోజుకు 11 లక్షల మంది కరోనా బారిన పడుతున్న వేళ.. మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగా ఉండటం.. నిబంధల్ని.. గైడ్ లైన్స్ ను జాగ్రత్తగా పాటించని మన దేశంలో కరోనా మూడో వేవ్ లో గరిష్ఠ స్థాయికి కేసులు చాలా తేలిగ్గా చేరుకుంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతనన్నాయి.

ఇందుకు తగ్గట్లే రోజుల వ్యవధిలోనే వందల కేసుల నుంచి లక్షన్నర కేసుల వరకు వెళ్లటం.. చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా కరోనా పరీక్షకు సంబంధించిన భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది.

కరోనా పరీక్షను ఎలాంటి లక్షణాలు లేని వారు కానీ.. అనుమానం తీర్చుకోవటానికి కానీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. పరీక్ష చేయించుకోవాల్సిన వారు ఎవరెవరు? అన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఐసీఎంఆర్ లెక్క ప్రకారం దగ్గు.. జ్వరం.. గొంతులో సమస్య.. రుచి.. వాసన కోల్పోవటం లాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాల్సిందేనని పేర్కొంది.

అదే సమయంలో పెద్ద వయస్కులు.. అనారోగ్య సమస్యల పరంగా హై రిస్కు కేటగిరిలోకి రాకపోతే.. కొవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్ కు పరీక్షలు కూడా అవసరం లేదని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు.. రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు కొవిడ్ పరీక్షు చేయించుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.

అంతేకాదు.. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే.. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని.. మళ్లీ పరీక్ష చేయించాల్సిందేనని స్పష్టం చేసింది. నెగిటివ్ వచ్చినప్పటికీ కొవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆరర్ పరీక్ష చేయించుకోవటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.