Begin typing your search above and press return to search.

కరోనా విరుగుడుగా గంగాజలం.. తిరస్కరించారు

By:  Tupaki Desk   |   8 May 2020 4:30 PM GMT
కరోనా విరుగుడుగా గంగాజలం.. తిరస్కరించారు
X
కరోనా వైరస్ నివారణకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రెడీ చేసే పనిలో సీరియస్ గా ముందుకెళ్తున్నారు. భారత్ లోనూ ఫార్మా కంపెనీలు ఇదే పనిలో బిజీగా ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. గంగాజలంతో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టవచ్చేమో పరీక్షించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ )కు ప్రతిపాదన చేసింది. దీన్ని ఐసీఎంఆర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది..

దేశంలో గంగాజలాన్ని శివుడికి ప్రతీరూపం పవిత్రజలంగా.. పాపపుణ్యాలు పోగొట్టే పవిత్ర పావనిగా ప్రజలు నమ్ముతారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనితో వ్యాక్సిన్ తయారు చేయాలని ఐసీఎంఆర్ కు ప్రతిపాదనలు ఏప్రిల్ 28న పంపింది. ఈ గంగాజలంపై క్లినికల్ పరిశోధన సాధ్యపడదని ఐసీఎంఆర్ చైర్ పర్సన్ గుప్తా స్పష్టం చేశారు. సైంటిఫిక్ డేటా, తగు ఆధారాలు అవసరమని..ఏవీ లేకుండా చేయమని తేల్చిచెప్పారు.

కాగా నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) అధికారులు ఇదివరకు గంగానది నీళ్ల ప్రత్యేక లక్షణాలు, నాణ్యతపై పరిశోధనలు జరిపారు. గంగా నీటిలో బ్యాక్టీరియోఫేజ్ లు అధికంగా ఉంటాయని.. ఇందులో ఎటువంటి యాంటీ వైరల్ లక్షణాలు రుజువు కాలేదని సైంటిస్టులు తెలిపారు. అయినప్పటికీ దేశంలో నమ్మకం దృష్ట్యా ఈ ప్రతిపాదనలు ఐసీఎంఆర్ కు వస్తూనే ఉన్నాయి.

ఇవే కాదు.. హిమాలయాల్లోని తెహ్రీ-భగీరథి, శ్రీనగర్-అలకనంద నదుల్లోని పైభాగంలో ఉన్న నీటితోనూ కరోనాకు విరుగుడు కనిపెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయి.