Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ల ప్రభావం పై ఐసీఎంఆర్ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   10 Sep 2021 4:52 AM GMT
వ్యాక్సిన్ల ప్రభావం పై ఐసీఎంఆర్ షాకింగ్ కామెంట్స్
X
కరోనా నుండి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్లు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.బలరాం భార్గవ వెల్లడించారు. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నవారిలో మరణం సంభవించే ముప్పు 96.6శాతం మేర తగ్గుతుందని చెప్పారు. రెండు డోసులు తీసుకున్నవారిలో ఆ ముప్పు 97.5శాతం మేర నివారించబడుతోందని , ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సేకరించిన డేటాతో ఈ విషయాన్ని నిర్దారించినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఏప్రిల్-మే నెలల్లో సంభవించిన మరణాల్లో ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోనివారే ఉన్నారని బలరాం భార్గవ వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ల పనితీరు అన్ని వయసుల వారిలో ప్రభావవంతంగా ఉందన్నారు. 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్లు పైబడ్డవారి వరకూ అందరిలోనూ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కరోనా వైరస్ నుంచి పూర్తి రక్షణ లభిస్తోందనే విషయం ఈ డేటాతో స్పష్టమైందని నీతి ఆయోగ్ సభ్యుడు,కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డా.వీకే పాల్ స్పష్టం చేశారు.
18 ఏళ్లు దాటిన 58శాతం మందికి ఇప్పటివరకూ వ్యాక్సిన్ సింగిల్ డోసు అందింది. ఇది 100 శాతానికి చేరాలి. ఏ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలిపోవద్దు. ఇప్పటివరకూ మొత్తం 72 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే మిగతావాళ్లు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని వీకే పాల్ వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడే అవకాశం ఉంటుందని, అయితే అలాంటి కేసుల్లో మరణం సంభవించే ప్రమాదం ఉండదని అన్నారు. అప్పటికే వ్యాక్సిన్ తీసుకుని ఉండటం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తక్కువేనని అన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా పుంజుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు. గత మే నెలలో రోజుకు సగటున 20 లక్షల డోసులు వేయగా సెప్టెంబర్‌‌లో ఆ సంఖ్య 78 లక్షలకు చేరిందన్నారు.గడిచిన 24 గంటల్లో 86 కోట్ల మందికి డోసులు పంపిణీ చేశామన్నారు.

ప్రస్తుతం పండుగల సీజన్‌ లో వ్యాక్సినేషన్ మరింత వేగంగా జరగాలని, వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ త్వరగా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా గురువారం 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొన్నటితో పోలిస్తే దాదాపు ఆరు వేల కేసులు పెరగడం గమనార్హం. గత 24 గంటల్లో 338 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కారణంగా 4,41, 749 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 3.23 కోట్ల మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రికవరీ రేటు 97.48 శాతం గా ఉంది.