Begin typing your search above and press return to search.

ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్

By:  Tupaki Desk   |   5 Oct 2015 4:46 AM GMT
ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్
X
తెలంగాణ సర్కారు ఉపశమనం పొందే వార్తగా దీన్ని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్యన విడుదలైన ఒక నివేదికలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ ముందు ఉండటం తెలంగాణ సర్కారుకు ఇబ్బందిగా మారింది. దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక పాలసీ అని కేసీఆర్ సర్కారు చెబుతుంటే.. అగ్రశ్రేణి ర్యాంకు ఏపీకి దక్కటం తెలంగాణ పాలకులకు చిరాకు పుట్టించిన పరిస్థితి.

తమకు గుర్తింపు లభించటం లేదన్న బాధను తీరుస్తూ తాజాగా తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణను ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ ట్రేడింగ్ ఏజెన్సీ (పొట్టిగా చెప్పుకోవాలంటే ఇక్రా) గుర్తించింది. ఉమ్మడి రాష్ట్రంలో మైనస్ కేటగిరిలో ఉన్న తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నెంబర్ వన్ గా మారటమే కాదు.. ప్లస్ కేటగిరిలోకి చేరటం చూస్తే.. తెలంగాణ ఆర్థిక బలాన్ని చాటి చెప్పే అంశంగా చెప్పొచ్చు.

దేశంలోని ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన ఇక్రా.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని.. తమ అధ్యయనంలో ఆరు అంశాల్లో సానుకూలంగా ఉందని పేర్కొంది. పన్నుల ఆదాయంతో మెరుగ్గా ఉండటంతోపాటు.. దేశ తలసరి ఆదాయం రూ.74,380 కాగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.95,361గా ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల పెట్టుబడి వ్యయంలో రుణం వాటా చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించటంతోపాటు.. వివిధ కార్యక్రమాల కోసం పెడుతున్న పెట్టుబడులు ఆస్తుల సృష్టికి దోహదపడతాయని పేర్కొంది.

ఇక్రా నివేదికలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రేటింగ్ ఇవ్వటం వల్ల దేశ.. విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర పరపతి పెరగనుంది. జాతీయ.. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలను పొంది.. వాటిని తిరిగి చెల్లించే విధానంలో ఆర్థిక వ్యవస్థలకున్న బలాన్ని ఈ నివేదిక వెల్లడిస్తోంది. తాజా ర్యాకింగ్ తో చాటి చెప్పే అంశం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంతబలమైనదన్నది మరోసారి నిరూపితమైంది. ఇంత ఆర్థికంగా బలమైన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీగా జరగటం అసలైన దురదృష్టకరం.