Begin typing your search above and press return to search.

కాళేశ్వరం ఖర్చును తగ్గించే ఐడియాలు?

By:  Tupaki Desk   |   30 July 2018 3:48 AM GMT
కాళేశ్వరం ఖర్చును తగ్గించే ఐడియాలు?
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దీంతో తెలంగాణ రూపురేఖల్ని మార్చేయనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేయటం తెలిసిందే. వడివడిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ఎన్నికలకు ముందే ఏదోలా కాళేశ్వరాన్ని పూర్తి చేసినట్లుగా చూపించాలన్న తపన కేసీఆర్ సర్కారుకు ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్ గా సాధ్యం కాదని చెబుతున్నారు. దీని కారణంగానే.. కాళేశ్వరం అద్భుతం.. మహా అద్భుతం అని నోరారా పొగిడేసిన మీడియా.. ఇప్పుడు అందుకు భిన్నంగా సాంకేతిక సవాళ్లతో కాళేశ్వరం ఎంతగా ఇబ్బంది పడుతోందన్న వైనాన్ని మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది. అదేంటి? ప్రభుత్వానికి ఇబ్బంది పడేలా ఈ నెగిటివ్ స్టోరీ ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరీ ఎంపిక చేసిన కొందరు జర్నలిస్టులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకెళ్లటమే కాదు.. ప్రాజెక్టు నిర్మాణంలో తమకు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేకంగా కథనాలు రాసేలా ఏర్పాట్లు చేయటం గమనార్హం.

ఈ కథనాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సాంకేతిక కష్టాల మీదనే కథనాలు అచ్చు అవుతాయి. దీని ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలస్యమవుతున్నా.. దానికి కారణంగా కేసీఆర్ సర్కారు కాదన్న భావన ప్రజల మనసులో రిజిష్టర్ కావాలని భావిస్తున్నారు. ఇలా.. కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చే మైలేజీలో కించిత్ పోగొట్టుకోవటానికి సైతం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను మోడీ సర్కారు ముందు తెలంగాణ సర్కారు పెట్టటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ భారీ ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకునేలా కొత్త సలహాలు.. సూచనలు భారీగా వస్తున్నాయి. అయితే.. వీటిని తీసుకోవటానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్లే.. తాజాగా నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో.. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ మొత్తంతో పూర్తి చేయటానికి అవసరమైన సలహాలు.. సూచనల్ని వెల్లడించారు సీనియర్.. రిటైర్డ్ ఇంజీనీర్లు.

వారేం సూచనలు చేశారో చూస్తే..

- తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించడంతో ఏటా రూ. 1,000 కోట్లకు పైగా విద్యుత్‌ బిల్లుల భారం పడనుంది. ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి తరలింపునకు విద్యుత్‌ చార్జీలు 5 రేట్లు పెరుగుతాయి.

- తుమ్మిడిహెట్టి నుంచి ఏడాది పొడుగునా తక్కువ ఖర్చుతో నీరు తరలించుకునే అవకాశం ఉంది. అయితే.. అవసరం లేని మేడిగడ్డ - సుందిళ్ల - అన్నవరం బ్యారేజీల నిర్మాణానికి వేల కోట్ల రూపాయిలు ఖర్చులు చేయడం సరికాదు.

- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తుండటంతో ఈ అవకాశం లేకుండా పోయింది.

- తుమ్మిడి హెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించినా 152 మీటర్ల ఎత్తుకు సమానంగా నీటిని తరలించుకోవచ్చు. దీనికోసం డిజైన్లలో మార్పులు చేసుకోవాలి.

- మల్లన్నసాగర్‌ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం అవసరం లేదు. ఇమామాబాద్‌ దగ్గర 0.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌ ద్వారా 156 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉండగా, ఇక్కడినుంచి 120 రోజుల్లో 90 టీఎంసీల నీరే తరలించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఇమామాబాద్‌ బ్యారేజీ సామర్థ్యం పెంచితే నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది.

- దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద లినమెంట్‌ మల్లన్నసాగర్‌కు అనుకుని ఉంది. అక్కడ భారీ డ్యాం నిర్మిస్తే భూకంపాలొచ్చే ప్రమాదముంది.

- కాళేశ్వరం కింద 200 టీఎంసీలతో 18.5 లక్షల కొత్త ఆయకట్టు, 18.80 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 37.30 లక్షల ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక టీఎంసీతో 16 వేల ఎకరాలకు నీరు అందిస్తామంటున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా ఒక టీఎంసీతో 10 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు. ఈ లెక్కన చూస్తే.. కాళేశ్వరం కింద ఏటా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందే ఛాన్సే లేదు.