Begin typing your search above and press return to search.

బీజేపీ పాలనలో బతికే కంటే చంద్రమండలానికి వెళ్లడమే బెటరట!

By:  Tupaki Desk   |   26 July 2019 3:42 PM GMT
బీజేపీ పాలనలో బతికే కంటే చంద్రమండలానికి వెళ్లడమే బెటరట!
X
దేశంలో మూకదాడులు - అణగారిన వర్గాలపై అకృత్యాలు ఎక్కువైపోతున్నాయంటూ ప్రధానికి లేఖలు రాస్తున్నారు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు. ఈ లేఖలు అలజడి సృష్టిస్తున్నాయి. ఇప్పటికి 49 మంది ప్రముఖులు ఇలా లేఖలు రాయగా అందులో కేరళకు చెందిన దిగ్గజ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ కూడా ఉన్నారు. దీంతో కేరళకే చెందిన బీజేపీ నేత బి.గోపాలకృష్ణన్.. ఆదూర్ గోపాలకృష్ణపై విరుచుకుపడ్డారు. జైశ్రీరాం అనేవారే ఇక్కడుండాలని.. లేనిపక్షంలో చంద్రుడి మీదకు వెళ్లిపోవాలని సూచించారు. శ్రీహరికోటలో పేరు నమోదు చేసుకోవాలంటూ ఆయన వెటకారమాడారు. అయితే.. బీజేపీ నేత వెటకారానికి ఆదూర్ కూడా బదులిచ్చారు. బీజేపీ పాల‌న‌లో కొన‌సాగుతున్న భార‌త్‌లో నివ‌సించ‌డం కంటే చంద్ర‌మండ‌లానికి వెళ్ల‌డ‌మే నయమన్నారాయన.

బీజేపీ నాయ‌కులు ఎవ‌రైనా చంద్రునిపై త‌న కోసం ప్ర‌త్యేకంగా ఓ గదిని చూసి పెట్టాల‌ని ఆయ‌న కోరారు. అలాగే- చంద్రుని మీదికి వెళ్ల‌డానికి అవ‌స‌ర‌మైన టికెట్‌ను కొనివ్వాల‌ని ఆయ‌న బీజేపీ నాయ‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. టికెట్ కొని పంపిస్తే సంతోషంగా వెళ్లిపోతానన్నారు. ప్ర‌శ్నించిన వారిని దేశం విడిచి వెళ్లిపోవాల‌ని ఆదేశించ‌డం స‌రికాద‌న్నారాయన. ఈ స‌మాజంలో - ఈ దేశంలో స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కు అంద‌రికీ ఉంద‌ని.. మీకు నచ్చినట్లు ఉండలేదన్న కారణంతో ఎంతమందిని చంద్రమండలం పైకి పంపించగలరని ప్రశ్నించారు.

కాగా ఆదూర్ గోపాలకృష్ణన్‌ తో పాటు ఇతర దర్శకులు మ‌ణిర‌త్నం - శ్యామ్ బెనెగ‌ల్‌ - అనురాగ్ క‌శ్య‌ప్‌ వంటివారు.. నటి కొంక‌ణాసేన్ శ‌ర్మ వంటి వారు ప్రధానికి లేఖలు రాశారు. అయితే, వారికి కౌంట‌ర్‌ గా 61 మంది వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప్ర‌ధానికి అండ‌గా నిలిచారు. ప్రధానికి అండగా నిలిచిన వారిలో కంగనా రనౌత్ తదితరులున్నారు. జ‌మ్మూకాశ్మీర్‌ లో తీవ్రవాదులు విచ్చ‌ల‌విడిగా దాడులు చేస్తే ప్రాణాల‌ను హ‌రిస్తున్న స‌మ‌యంలో ఈ సోకాల్డ్ మేధావులంతా ఏం చేశార‌ని వారు ప్రశ్నిస్తున్నారు.

మోదీ గత ప్రభుత్వ కాలంలో దేశంలోని మేధావి వర్గానికి చెందిన చాలామంది తమ అవార్డులను వెనక్కిచ్చేశారు. అప్పట్లో ఆ అంశం ఎంతో వివాదాస్పదమైంది. ఇప్పుడు మోదీకి లేఖలు రాయడం కూడా వివాదాలకు కేంద్రమవుతోంది. ఇది కూడా అవార్డు వాపసీ మాదిరిగానే రాజకీయ ప్రేరేపితమన్న వాదనలు వినిపిస్తున్నాయి.